ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

APSFL: ఫైబర్​నెట్ టెండర్ల అక్రమాల ఆరోపణలు అబద్దం: హరికృష్ణ ప్రసాద్

ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏ1 నిందితుడు వేమూరు హరికృష్ణ ప్రసాద్​ అన్నారు. ఫైబర్‌నెట్‌ లిమిటెడ్(APSFL) టెండర్ల అక్రమాల ఆరోపణలు పూర్తిగా అబద్ధమని మేమూరు స్పష్టంచేశారు. ఏపీఎస్​ఎఫ్​ఎల్​కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై సీఐడీ విచారణ చేపట్టింది.

cid investigation in ap fiber net
cid investigation in ap fiber net

By

Published : Sep 14, 2021, 4:44 PM IST

Updated : Sep 15, 2021, 2:16 AM IST

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్(APSFL)కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తొలిదశ టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయనడం పూర్తిగా అబద్ధమని.. ఆ టెండర్ల సాంకేతిక మదింపు కమిటీలో అప్పట్లో సభ్యుడిగా ఉన్న వేమూరి హరికృష్ణప్రసాద్‌ స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో వస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. దీనికి సంబంధించి నమోదైన కేసులో ఆయన సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయానికి ఉదయం 11.30 గంటలకు వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉన్నారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తప్పుడు ఆరోపణలకు సంబంధించి నా వైపు నుంచి సమాధానం ఇవ్వడానికి వచ్చాను. ఈ రోజు నన్నేమీ అడగలేదు. సీఐడీ(cid) నన్ను ప్రశ్నించాక.. నాపై వచ్చిన ఆరోపణలపై వివరంగా మాట్లాడుతాను" అని హరికృష్ణప్రసాద్‌ వివరించారు. వేమూరిని బుధవారం కూడా రమ్మనీ సీఐడీ అధికారులు కోరారు.

ఇదే కేసులో ఇన్‌క్యాప్‌ మాజీ ఎండీ కె.సాంబశివరావు కూడా విచారణకు హాజరయ్యారు. దర్యాప్తు అధికారులు ఆయన్ను వివరాలు అడిగారు. ఆయన దాదాపు సాయంత్రం వరకు సీఐడీ కార్యాలయంలోనే ఉన్నారు. ఇదే కేసులో టెరాసాఫ్ట్‌ ఎండీ టి.గోపీచంద్‌కు నోటీసులిచ్చినప్పటికీ.. ఆయన విచారణకు రాలేదు.

అసలేం జరిగిందంటే..

ఏపీ ఫైబర్‌నెట్‌(APSFL)లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు సీఐడీకి ఆదేశాలిస్తూ.. ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కాంట్రాక్టర్‌కు అనుకూలంగా టెండర్లను ఖరారు చేశారన్నారు. ఈ అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగా కేసును సీఐడీకి అప్పగించారు. ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సీఐడీ అదనపు డీజీని ఆదేశించారు.

ఏపీ ఫైబర్ నెట్​కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 121 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు సీఐడీ విచారణలో గుర్తించామని.. ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌ నెట్ లిమిటెడ్(APSFL) ఛైర్మన్ పి. గౌతమ్​రెడ్డి సోమవారం తెలిపారు. సాంకేతిక పరికరాలు సంస్థకు చేరకుండానే బిల్లులు మంజూరు చేశారని..వీటితో పాటు సాంకేతికపరంగా పలు రకాల అవకతవకలు జరిగాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా టెరా సాఫ్ట్ సంస్థను బ్లాక్ లిస్టు తొలగించారని.. దీనిపై అభ్యంతరాలు, ఫిర్యాదులను పట్టించుకోలేదన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 18మందిని అనుమానితులుగా గుర్తించి సీఐడీ కేసులు నమోదు చేశారన్నారు. బాధ్యులు ఎంతటి వారైనా సరే సీఐడీ చర్యలు తీసుకుంటుందన్నారు.

నిందితులు వీరే..:

నిందితుల జాబితాలో టెండర్ల సాంకేతిక మదింపు కమిటీకి అప్పట్లో సభ్యుడిగా వ్యవహరించిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌తో పాటు ఇన్‌క్యాప్‌ అప్పటి ఎండీ కె.సాంబశివరావు, టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ, దాని ఛైర్మన్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ కోటేశ్వరరావు, ఎండీ టి.గోపీచంద్‌, డైరెక్టర్లు ఆర్‌.ఎస్‌.బక్కనవర్‌, టి.హనుమాన్‌ చౌదరి, డా.టి.వి.లక్ష్మి, టి.బాపయ్య చౌదరి, టి.పవనదేవి, కె.రామారావు, హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ సంస్థ, దాని డైరెక్టర్లు ఎం.పి.శుక్లా, మహేంద్ర నెహతా, అరవింద్‌ ఖర్బందా, డా.ఆర్‌.ఎం.కస్తియా, రాజీవ్‌ శర్మ, బేలా బెనర్జీ ఉన్నారు. వీరితోపాటు కొందరు ప్రభుత్వోద్యోగులు, ఇతరులనూ నిందితులుగా పేర్కొంది. వారి పేర్లు ప్రస్తావించలేదు.

APSFL: 'ఫైబర్‌ నెట్​లో రూ. 121 కోట్ల అక్రమాలు..బాధ్యులెవరైనా చర్యలు..'

Last Updated : Sep 15, 2021, 2:16 AM IST

ABOUT THE AUTHOR

...view details