ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కేంద్రంతో మాట్లాడకుండా.. బాధ్యతారాహిత్యంగా లేఖ రాస్తారా?'

పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయటంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రాజెక్టు విషయంలో సమస్య వస్తే కేంద్రంతో మాట్లాడకుండా బాధ్యతారాహిత్యంగా లేఖ రాస్తారా అని మండిపడ్డారు. ప్రాజెక్టులపై ఎలాంటి అవగాహన లేకుండా రాష్ట్రానికి నష్టం చేయొద్దని హితవు పలికారు.

chandra babu
chandra babu

By

Published : Nov 1, 2020, 1:36 PM IST

Updated : Nov 1, 2020, 5:02 PM IST

మీడియాతో చంద్రబాబు

ముఖ్యమంత్రి జగన్‌ పోలవరం ప్రాజెక్టుపై అవగాహన లేని రాజకీయం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రాజెక్టు విషయంలో సమస్య వస్తే కేంద్రంతో మాట్లాడకుండా బాధ్యతారాహిత్యంగా లేఖ రాస్తారా అని మండిపడ్డారు. జగన్‌కు అవగాహన లేకపోతే పూర్తిగా తెలుసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాల విషయంలో జోక్యం చేసుకోవాలని, నిర్మాణం పూర్తి చేసేలా నిధులు ఇప్పించాలని కోరుతూ సీఎం జగన్‌ ప్రధాని లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆదివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ జగన్‌ ప్రధానికి రాసిన లేఖపై స్పందించారు. పోలవరంపై కేంద్రంతో నేరుగా మాట్లాడకుండా తెదేపాపై ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులపై ఎలాంటి అవగాహన లేకుండా రాష్ట్రానికి నష్టం చేయొద్దని హితవు పలికారు. ప్రధానికి రాసిన లేఖ ద్వారా జగన్‌ చులకన అయ్యారని ఎద్దేవా చేశారు.

పోలవరం ప్రాజెక్టును తెదేపా హయాంలో 71 శాతం పూర్తి చేశాం. ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చని ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అప్పట్లో కేంద్ర మంత్రి గడ్కరీ వచ్చి పోలవరం నిర్మాణం చూసి అభినందించారు. 2019లో సాంకేతిక సలహా కమిటీ రూ.55 వేల కోట్ల అంచనాలను ఆమోదించింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వానిదేనని 2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు. పోలవరం నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని నీతి ఆయోగ్‌ సూచించింది. అయితే విద్యుత్‌ కేంద్రం ఖర్చు మాత్రమే మేం పెట్టుకుంటామని స్పష్టం చేశాం. ప్రాజెక్టు, ఆర్‌ అండ్‌ ఆర్‌ వ్యయం కేంద్రమే భరిస్తుందని అప్పట్లో స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో ఒక బృందాన్ని దిల్లీలో ఉంచి కేంద్రానికి కావాల్సిన సమాచారం అందించాం. పలువురు రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నలకూ కేంద్రం ఇదే సమాధానం చెప్పింది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరగడం సహజం. సాగునీటి ప్రాజెక్టులపై నేను ఇచ్చిన సలహాలు పెడచెవిన పెట్టారు. అజ్ఞానం, గర్వం, అహంకారంతో రాష్ట్రాన్ని సొంత ఎస్టేట్‌లా పాలిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహకారంతో ప్రాజెక్టులు కడతామని జగన్‌ మొదట్లో హడావుడి చేశారు. ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది. పోలవరం విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజలు స్పందించాలి-చంద్రబాబు, తెదేపా అధినేత

Last Updated : Nov 1, 2020, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details