ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డొల్ల కంపెనీలతో చైనీయుల మనీలాండరింగ్‌.. దేశవ్యాప్తంగా 500 డొల్ల కంపెనీలు ? - Recognition of 500 shell companies in india

Money Laundering with shell companies: డొల్ల కంపెనీలతో చైనీయులతోపాటు స్థానికంగా ఉన్న కొందరిని డమ్మీ డైరెక్టర్లుగా చూపుతూ భారీ ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఏపీ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) వర్గాలు విజయవాడ పోలీసులకు చేసిన ఫిర్యాదుపై విచారణ మొదలైంది. దేశవ్యాప్తంగా 500 డొల్ల కంపెనీల గుర్తించినట్లు సమాచారం.

Money Laundering with shell companies
Money Laundering with shell companies

By

Published : Feb 4, 2022, 8:54 AM IST

Money Laundering: డొల్ల కంపెనీలు.. వాటికి చైనా నుంచి పెట్టుబడులు. చైనీయులతో పాటు స్థానికంగా ఉన్న కొందరిని డమ్మీ డైరెక్టర్లుగా చూపుతూ రాష్ట్రంలో కంపెనీలు పెట్టారు. వాటిద్వారా ఏటా రూ.వందల కోట్ల టర్నోవర్‌ జరిగినట్లు చూపారు. అలా భారీ ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఏపీ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) వర్గాలు విజయవాడ పోలీసులకు చేసిన ఫిర్యాదుపై విచారణ మొదలైంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం...

చైనా కంపెనీల మాటున...

దేశంలో 500 వరకు డొల్ల కంపెనీలను చైనీయులు రిజిస్టర్‌ చేసినట్లు కేంద్ర కార్పొరేట్‌ మంత్రిత్వశాఖ ఒక రహస్య జాబితాను పంపినట్లు సమాచారం. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 4, తెలంగాణలో 12, కర్ణాటకలో 197... ఇలా ఇంకా తమిళనాడు, మహారాష్ట్రల్లోనూ బోగస్‌ కంపెనీలు ఉన్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో అలీబాబా ప్రాజెక్ట్స్‌ డాట్‌ కామ్‌ (అమలాపురం), అలీబాబా కామర్స్‌ డిజిటల్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (తిరుపతి), డెన్సిటింగ్‌ ప్రెసిషన్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (విశాఖపట్నం), సీఈటీసీ రెన్యువబుల్‌ ఎనర్జీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (చిత్తూరు జిల్లా, శ్రీసిటీ) కంపెనీలను ఆర్‌వోసీ వర్గాలు గుర్తించాయి. ఈ కుట్రలో ఆయా కంపెనీల ప్రస్తుత, పూర్వ డైరెక్టర్లు 11 మంది, వారికి తప్పుడు ధ్రువీకరణలు ఇచ్చిన 10మంది కంపెనీ సెక్రటరీలు, చార్టర్డ్‌ అకౌంటెంట్లపై ఆర్‌వోసీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

నాగవెంకట సత్యరామకృష్ణ వక్కపట్ల, సూర్యనారాయణ వక్కపట్ల (అమలాపురం), పందికుప్పం సుజని (తిరుపతి), చిన్న త్యాగరాజన్‌ (చిత్తూరు), సయ్యద్‌ షారిబ్‌ అబ్బాస్‌ రిజ్వీ (అలహాబాద్‌), జియాన్‌చో యాంగ్‌, జిన్‌ జియో, డలియాంగ్‌ జౌ, కివయాన్‌ కో (చైనా), ఉషా సీతారామ్‌ (చెన్నై), చంద్ర కుదిరి (నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట) డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ కుట్రకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారికి అవసరమైన ధ్రువీకరణలను ఇచ్చిన కంపెనీ సెక్రటరీలు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు జనార్దన్‌రెడ్డి, కృష్ణయ్య చెరువు (హైదరాబాద్‌), మాచర్ల రోశయ్య, దండపాణి (చెన్నై), మనిషేక్‌ మిత్తల్‌, రజని కోహ్లీ (దిల్లీ), వందనా లాల్‌వానీ (జైపూర్‌), కాకుటూరు భార్గవ్‌తేజ, చిన్ని శ్రావణ్‌కుమార్‌ (నెల్లూరు)లపై పోలీసులు కేసు నమోదుచేశారు.

కంపెనీల కార్యకలాపాలపై ఆరా?

డొల్ల కంపెనీల వ్యవహారం 2017 నుంచి కొనసాగుతోందని అనుమానిస్తున్నారు. ఒక కంపెనీ సౌర ఫలకాల తయారీకి ఏటా సుమారు రూ.200 కోట్ల మేర ముడిసరకు చైనా నుంచి దిగుమతి చేసుకున్నట్లు చూపుతోంది. ముడిసరకు రాకుండానే నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించి.. వాటికి చెల్లింపులు జరుపుతోంది. ఇలా లావాదేవీలు జరగకుండానే మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారన్న అనుమానంపై దర్యాప్తు ప్రారంభించారు. కంపెనీ కార్యకలాపాలు ఏంటి? పన్నుల చెల్లింపు వంటి అంశాలపైనా అధికారులు దృష్టిసారించారు. కొన్ని కంపెనీల డైరెక్టర్లకు నోటీసులు జారీచేసినా.. వారి నుంచి స్పందన లేకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రిజిస్టర్డ్‌ ఆఫీసులే కనిపించట్లేదు

చిత్తూరు జిల్లా శ్రీసిటీలోని సీఈటీసీ రెన్యువబుల్‌ ఎనర్జీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ మాత్రమే రిజిస్టర్డ్‌ ఆఫీసు కింద పేర్కొన్న చిరునామాలో కార్యాలయాన్ని నిర్వహిస్తోందని అధికారులు గుర్తించారు. మిగిలిన మూడు కంపెనీలు ఇచ్చిన చిరునామాల్లో మామూలు ఇళ్లు ఉన్నాయి. కంపెనీల్లో డైరెక్టర్లుగా ఒకే కుటుంబానికి చెందినవారే ఉన్నారు. దీనిపై అధికారులు విచారించగా.. కంపెనీ డైరెక్టర్లుగా ఉంటే ప్రతినెలా రూ.10 వేలు ఇచ్చేలా చైనీయులు చెప్పినట్లు తేలింది. మొత్తం వ్యవహారంపై విచారణకు హాజరుకావాలని కంపెనీలకు నోటీసులు జారీ చేశామని, వాళ్లు ఇచ్చే సమాచారం ఆధారంగా నిర్ణయానికి వస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి..ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరనే మాట ఎక్కడా వినిపించకూడదు: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details