బడుల విలీనంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్లకు దగ్గరగా ఉన్న పాఠశాలల్లో హాయిగా చదువుకుంటున్న తమ బుజ్జాయిలు ఇప్పుడు కిలోమీటర్ల కొద్దీ వెళ్లి రావాల్సిన దుస్థితి దాపురించిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం బడుల ముందు ధర్నాకు దిగారు. కొందరు పాఠశాలలకు తాళాలు వేసి మరీ నిరసన తెలిపారు.
ఒకడే ఒక్కడు మిగిలాడు..
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం కారుపల్లిపాడులోని ప్రాథమిక పాఠశాలకు చెందిన 3, 4, 5 తరగతులు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీంతో ఇక్కడ 2వ తరగతి చదువుతున్న ఒకే ఒక్క విద్యార్థి మిగిలాడు. ఆ బాలుడికి ఉపాధ్యాయుడు శ్రీనివాస్ బుధవారం పాఠాలు బోధిస్తూ కనిపించారు. ఈ ఒక్క విద్యార్థికి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు ఇంటి దగ్గర వంట చేసుకొని భోజనం తీసుకురావడం గమనార్హం.
ఉన్న చోటే కొనసాగించాలి..విలీనాన్ని ఆపేయాలని నంద్యాల జిల్లా మిడుతూరు మండలం అలగనూరు, ఉప్పలదడియ గ్రామాల ప్రజలు కోరారు. అలగనూరులోని ప్రాథమిక పాఠశాల గేటుకు తాళాలు వేసి నిరసన తెలిపారు.