ప్రతి రోజూ బడికి వెళ్లి లెఫ్ట్-రైట్, లెఫ్ట్-రైట్ అంటూ చేసే డ్రిల్ ఇప్పుడు లేదు. ఎస్ మామ్, ప్రెజెంట్ మామ్‌లు లేవు. ఉన్నదల్లా లాగిన్-లాగౌట్‌లు. థమ్స్‌అప్, థమ్స్‌డౌన్‌లు. మ్యూట్‌లు, అన్‌మ్యూట్‌లు. అర్థమయిందా అని అడిగితే థమ్స్ అప్. అర్థం కాలేదంటే థమ్స్ డౌన్. బాల్యానికి అబ్బిన సరికొత్త బాడీ లాంగ్వేజ్ ఇది. కొత్త ఎటికేట్ నేర్చుకుంటున్నారు. వళ్లు విరుచుకోకూడదు. క్లాస్ జరుగుతున్నప్పుడు తినకూడదు. క్రాఫ్ట్ క్లాస్‌లూ, డ్యాన్స్ క్లాసులూ ఆన్‌లైన్‌లోనే. నర్సరీ పిల్లలూ ఇప్పుడు వారి స్థాయికి టెక్ గురూలయిపోయారు. అమ్మా నాన్నలకే టెక్ పాఠాలు చెబుతున్నారు. జూమ్‌లో జూమ్‌ఇన్ జూమ్ అవుట్ వారికి సర్వసాధారణమైంది.
సందడికి బ్రేక్ లేదు
పాఠశాలకు వెళ్లినప్పుడు క్లాస్‌కు.. క్లాస్‌కు మధ్య బ్రేక్ ఉండేది కాదు. ఇప్పుడు క్లాస్, క్లాస్‌కూ మధ్య బ్రేక్. ఈ బ్రేక్‌ను సద్వినియోగం చేసుకోవడాన్ని పిల్లలు నేర్చుకున్నారు. క్లాస్‌లోని తోటి పిల్లలతో ముచ్చట్లు పెడుతున్నారు. మా ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ ఇది, నువ్వేం తిన్నావ్ దగ్గర్నుంచి టీవీలో చూస్తున్న షోల వరకు వారి మధ్య ఎన్నో ముచ్చట్లు.
ప్రతిరోజూ పేరెంట్స్-టీచర్స్ మీటింగ్
గతంలో పేరెంట్స్-టీచర్స్ సమావేశం నెలలో ఒక రోజు ఉండేది. ఇప్పుడు ప్రతి రోజూ ఈ సమావేశం జరుగుతోంది. ఎందుకంటే దాదాపుగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు పిల్లల పక్కన ఉండాల్సి వస్తోంది. హోం వర్క్‌లో పిల్లలకు సాయపడాలంటే ముందుగా తల్లిదండ్రులకు అర్థం కావాలి. వారికేమైనా సందేహమొస్తే వెంటనే టీచర్లను అడిగి తెలుసుకోవడానికి సందేహించడం లేదు. టీచర్లూ అంతే సానుకూలంగా స్పందిస్తున్నారు. తల్లిదండ్రులు- తల్లిదండ్రుల మధ్యా కమ్యూనికేషన్ పెరిగింది. ఈ కొత్త మార్పుపై అనుభవాలను పంచుకుంటున్నారు. మొత్తంమీద అటు పాఠశాలలయాజమాన్యాలు, ఉపాధ్యాయులు-తల్లిదండ్రులు కలిసి ఎప్పటికప్పుడు ఈ కొత్త విధానాన్ని మెరుగుపర్చుకుంటూపోతున్నారు. అంతే కాదు.. ఈ మహమ్మారి కారణంగా పిల్లలకు చదువు దూరం కాకూడదని, మునుపెన్నడూ లేనంతగా టెక్నాలజీ కంపెనీలు-విద్యాసంస్థలు-స్వచ్ఛంద సంస్థలు- ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి.
కొన్ని దేశాల్లో ఇంటి వద్దకు ఉపాధ్యాయులు
కొన్ని దేశాల్లో సంపన్నులు కొంత భిన్నమైన పద్ధతినీ అనుసరిస్తున్నారు. కొన్ని కుటుంబాలు కలిసి ఒకరో, ఇద్దరో ఉపాధ్యాయులను నియమించుకుంటున్నాయి. ఒక లెర్నింగ్‌పాడ్‌లా ఏర్పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఉపాధ్యాయులు ఈ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.