ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తరువుకొస్తోంది తనువు.. తల్లడిల్లుతోందని 'చిన్నారి' మనువు! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

జనజీవితాలను అతలాకుతలం చేసిన కరోనా... పేద కుటుంబాల్లోని బాలికల ఆశలనూ చిదిమేసింది. ఉన్నత చదువులతో జీవితంలో స్థిరపడాలని వారు కన్న కలలు ఆవిరవుతున్నాయి. కరోనా వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలకిందులైన స్థితిలో తల్లిదండ్రుల మాటను కాదనలేక పెళ్లిపీటలెక్కుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలతో వివాహాల ఖర్చులు కూడా తగ్గిపోవడంతో కొందరు తల్లిదండ్రులకు అవకాశంగా మారింది. బాధితురాళ్లు లేదా ఇరుగుపొరుగు వారిచ్చే సమాచారంతో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి.

child marriages increased in corona crisis time in telangana state
తరువుకొస్తోంది తనువు.. తల్లడిల్లుతోందని 'చిన్నారి' మనువు!

By

Published : Jan 24, 2021, 11:47 AM IST

కరోనా వైరస్ బాలికల ఆశలను చిదిమేసి... బాల్యానికి పలుపుతాడుగా మారింది. కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోయి తక్కువ ఖర్చులు పేరిట గుట్టుగా బాల్య వివాహాలు పెరిగాయి. తల్లిదండ్రుల మాట కాదనలేకపోతున్న బాలికలు పెళ్లి పీటలెక్కుతున్నారు. హైదరాబాద్ నగరంలోని మల్లేపల్లిలో ఓ పేద విద్యార్థిని చదువులో ముందుండేది. ఆమె ఉన్నతవిద్యకు తామే ఆర్థిక సహకారం అందించాలని ఉపాధ్యాయులందరూ నిర్ణయించుకుని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పారు. తర్వాత ఏమైందో.. ఆ బాలిక జాడ లేదు. ఉపాధ్యాయులు ఆ బస్తీకెళ్లి వాకబు చేస్తే, సమీప బంధువుల అబ్బాయితో బాలికకు పెళ్లి చేసినట్లు తెలిసింది.

  • ఆ అమ్మాయికి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో మంచి మార్కులొచ్చాయి. కష్టమైనా ఆమెకు ఉన్నత విద్య చెప్పించాలనే తల్లిదండ్రులు కూడా అనుకున్నారు. ఇటీవల వారింటికి సమీపంలో మరో కుటుంబంలోని 14 ఏళ్ల అమ్మాయి ప్రియుడితో వెళ్లిపోయింది. ఆ తల్లిదండ్రులు భయపడి తమ కూతుర్ని చదివించాలన్న నిర్ణయం మార్చుకుని త్వరలోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు.
  • నిర్మల్‌ జిల్లాలోని ఒక ప్రైవేటు విద్యాసంస్థలో 450 మంది విద్యార్థినులు ఇంటర్‌, డిగ్రీ చదువుతున్నారు. వీరిలో 50 మంది విద్యార్థినులకు తల్లితండ్రులు లాక్‌డౌన్‌ సమయంలో పెళ్లిళ్లు చేసేశారు. మరికొందరికి నిశ్చితార్థాలు పూర్తయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లోని పలు కళాశాలల్లో ఇదే పరిస్థితి నెలకొందని సమాచారం.

అడ్డుకున్నవి తక్కువ... జరిగినవే ఎక్కువ

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలను పరిశీలిస్తే గత ఏడాది (2020)లో 600కి పైగా బాల్యవివాహాలను అధికారులు నిలిపివేయించారు. అడ్డుకున్న వాటి కంటే గుట్టుగా జరిగిపోయినవే ఎక్కువ ఉంటాయని సంక్షేమ శాఖల వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, గద్వాల, ఆసిఫాబాద్‌, నారాయణపేట, వరంగల్‌ గ్రామీణ, ములుగు, మహబూబాబాద్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి.

వయసునూ మార్చేస్తూ..

గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచి, గ్రామ కార్యదర్శి, అంగన్‌వాడీ సిబ్బంది బాల్యవివాహాలను అడ్డుకునే వీలున్నా, స్థానిక ఒత్తిళ్లకో, అమ్మాయి బంధువులు దాడి చేస్తారనే భయంతోనో వెనకడుగు వేస్తున్నారు. కొందరు తల్లితండ్రులు సొంతూళ్లో కాకుండా వేరే ప్రాంతానికి తీసుకెళ్లి గుట్టుగా పెళ్లితంతు పూర్తిచేస్తున్నారు. వివాహాలను అడ్డుకున్నాక ఆ బాలికలను బాలల సంరక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ) ముందు ప్రవేశపెట్టి వాంగ్మూలం నమోదు చేసినప్పుడు... ‘తమకు చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా, తల్లిదండ్రుల మాట కాదనలేక పెళ్లికి ఒప్పుకొన్నాం’ అని వారు వెల్లడిస్తున్నారు. కొందరు తమ కుమార్తెల వయసు 18 ఏళ్లుగా నిరూపించేలా తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు. ఆధార్‌కార్డులో పుట్టినతేదీని మార్చేస్తున్నారు. ఇద్దరి కన్నా ఎక్కువ మంది ఆడపిల్లలున్న కుటుంబాల్లో, తల్లిదండ్రుల్లో ఒకరు మాత్రమే (సింగిల్‌ పేరెంట్‌) ఉన్న కుటుంబాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాలిక సంరక్షణ, ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంచడం, ఆకతాయిల వేధింపుల నుంచి రక్షణ పేరిట త్వరగా పెళ్లిళ్లు జరిపిస్తున్నారని తెలుస్తోంది.

చట్టం అమలేదీ?

రాష్ట్రంలో బాల్యవివాహాల నిరోధ చట్టం - 2006 పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. జిల్లా, మండల, గ్రామీణ స్థాయిలో బాల్యవివాహాల నిరోధక కమిటీలున్నా, వాటికి సరైన అవగాహన కల్పించలేదు. ఉత్సవ కమిటీలు, దేవాదాయ ఈవో, వైద్య, విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, మహిళాశిశు సంక్షేమ, పోలీసు, సమాచార ప్రసార, వయోజన విద్య, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయలేమితో సరైన కార్యాచరణ కొరవడింది. ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన జిల్లా శిశు సంక్షేమాధికారులు (డీసీపీవో)లు ఒప్పంద సిబ్బంది కావడం, ఏటా ఈ పోస్టుల్లోకి కొత్తవారు రావడంతో బాల్యవివాహాల నిరోధంలో అవరోధాలు ఎదురవుతున్నాయి. బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్న గిరిజన జిల్లాలపై ప్రత్యేకశ్రద్ధ పెట్టాలని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

అధికారులపై దాడులు

వరంగల్‌ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలోని తాళ్లకుంట తండాలో ఈ నెలలో పదో తరగతి లోపు చదువుతున్న అయిదుగురు బాలికల వివాహాలకు ఏర్పాట్లు జరిగినట్లు ఫిర్యాదులొచ్చాయి. శిశు సంక్షేమ అధికారులు, పోలీసులు అక్కడికి వెళ్లగా 200 మంది గ్రామస్థులు అడ్డుకుని దాడులు చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి విద్యుత్తు సరఫరా తీసివేసి హంగామా సృష్టించారు. ఇవన్నీ తట్టుకుని అధికారులు ఆ వివాహాలను నిలిపివేశారు. ఒక్క డిసెంబరులోనే ఈ జిల్లాలో 25 వరకు పెళ్లిళ్లను అడ్డుకున్నారు. ‘

'వర్ధన్నపేటలో ఏడో తరగతి చదువుతున్న బాలికకు తల్లిదండ్రులు పెళ్లి తలపెట్టారు. మాకు సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లాం. ఈ విషయం తెలిసి బాలికను తీసుకుని తల్లిదండ్రులు పారిపోయారు. పోలీసులపైనా, మా సిబ్బందిపైనా గ్రామస్థులు దాడి చేశారు. వారిలో చదువుకున్న యువత కూడా ఉండటం బాధగా అనిపించింది' అని వరంగల్‌ జిల్లాకు చెందిన ఒక అధికారి చెప్పారు.

రాజధాని నడిబొడ్డున 250 మందికి...

" హైదరాబాద్‌లో ఇటీవల వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు నిత్యావసరాల సహాయం చేసేందుకు సర్వే జరిపాం. పాతబస్తీ తలాబ్‌కట్ట పరిధిలోని 20 మురికివాడలు, జూపార్కు సమీపంలోని షాహీన్‌నగర్‌లో కలిపి 1250 కుటుంబాలను ఆరా తీస్తే, విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఈ కుటుంబాల్లో 18 ఏళ్ల లోపున్న 250 మంది బాలికలకు కరోనా సమయంలో వివాహాలైనట్లు తెలిసింది. కరోనా నేపథ్యంలో కుటుంబపోషణ భారంగా మారుతుండడమే ఇందుకు కారణం."

- జమీలా, షాహీన్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు, పాతబస్తీ

ఇదీ చదవండి:

'బతికున్నప్పుడే కాదు.. మరణంలోనూ భార్యకు తోడయ్యాడు!

ABOUT THE AUTHOR

...view details