జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్... శుక్రవారం ఉదయం నుంచి తెలంగాణ భవన్లో ఉండి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని సీఎంకు అందజేశారు. ఆశించిన మెజారిటీ రాకపోవడం పట్ల సీఎం కొంత అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. ఫలితాలపై ఒకటి, రెండు రోజుల్లో ఆయన సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రి కేటీఆర్ శుక్రవారం రాత్రి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి, ఎన్నికల్లో కష్టపడ్డారని అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాల సరళి మొదలైన తర్వాత తెరాసకు ఆధిక్యం ఉండడం వల్ల తెలంగాణ భవన్లో సంబురాలు జరిగాయి. నేతలు, కార్యకర్తలు నృత్యాలు చేశారు. జీహెచ్ఎంసీలో అతి పెద్దపార్టీగా మరోసారి అవతరించిందని మిఠాయిలు పంచుకొని బాణసంచా కాల్చారు.