CM Jagan Comments on Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మించే చోట ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలు, నదీ గర్భం కోతకు ప్రకృతి ప్రకోపం కారణం కాదని.. హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఇది పూర్తిగా మానవ వైఫల్యమేనని...ఎగువ కాఫర్ డ్యాంలో పడ్డ గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. అసమర్థ ప్రణాళిక వల్లే ఈ ఉత్పాతం ఏర్పడింది అని హైదరాబాద్ ఐఐటీ నిపుణుల నివేదిక స్పష్టం చేసింది. మరి సకాలంలో ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్‌లను పూడ్చనిది ఈ ప్రభుత్వమేనన్న విషయం సీఎంకు తెలియనిది కాదు. అయినప్పటికీ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.
స్పిల్‌వే నిర్మాణం పూర్తి చేయకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు కట్టడం వల్లే పోలవరం నాశనమయిందని సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. ఏ నీటిపారుదల ప్రాజెక్టుకైనా కేంద్ర జలసంఘమే కీలకం. పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమైన సంస్థలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ..! వారి ఆమోదం లేకుండానే ఈ నిర్మాణాలు పాత ప్రభుత్వం చేసిందని నిరూపించగలరా? రికార్డులన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయి.
స్పిల్‌వే పూర్తి చేయకముందే ఈ నిర్మాణాలు చేపట్టేందుకు ఆ కమిటీలు అనుమతులు ఇవ్వలేదు, సంతకాలు చేయలేదు అని ఉంటే ఆ కాగితాలు ప్రదర్శించవచ్చు కదా..! స్పిల్‌వే నిర్మాణం పూర్తి చేయకుండా మిగిలినవి నిర్మించడం వల్లే పోలవరం ప్రాజెక్టు ఇలా అయిందని... కేంద్ర జలసంఘం కానీ, పోలవరం అథారిటీ కానీ, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ కానీ... పేర్కొన్న కాగితాలు ప్రభుత్వం వద్ద ఏమైనా ఉన్నాయా? ఉంటే శాసనసభలో చూపించవచ్చు కదా అన్నప్రశ్నలు వినిపిస్తున్నాయి.
శాసనసభలో మాట్లాడిన సీఎం... పోలవరంలో మొదట స్పిల్‌వే నిర్మించాలన్నారు. ఆ తర్వాత డయాఫ్రం వాల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు నిర్మించాలని చెప్పారు. అవన్నీ పూర్తయ్యాకే ప్రధాన డ్యాం కట్టాలన్నారు. చంద్రబాబు స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్ పూర్తి చేయకుండా 2.1 కిలోమీటర్ల ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం మొదలుపెట్టారని... దాన్నీపూర్తి చేయలేదని సీఎం అన్నారు. ఎగువ కాఫర్ డ్యాంలో ఒకచోట 380 మీటర్ల గ్యాప్, మరోచోట 300 మీటర్ల గ్యాప్ వదిలిపెట్టారని పేర్కొన్నారు. దిగువ కాఫర్ డ్యాంలో రెండు గ్యాప్‌లు వదిలిపెట్టారని చెప్పారు. వరద నీరు 2.1 కిలోమీటర్ల పొడవునా వెళ్లాల్సి ఉందని... అలా వెళ్లకుండా ఎగువ కాఫర్ డ్యాంలో వదిలిన గ్యాప్‌ల గుండా వెళ్లిందని అన్నారు. 2.1 కిలోమీటర్ల పొడవునా పోవాల్సిన నీరు ఈ రెండు గ్యాప్‌ల నుంచి వెళ్లాల్సి వచ్చేసరికి నదిలో ప్రధాన డ్యాం నిర్మించాల్సినచోట కోతపడిందని సీఎం అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా మీకు ఇష్టమొచ్చిన తటస్థ వ్యక్తిని అడగండి.. ఈ తప్పును చెబుతారని సీఎం అన్నారు.
కానీ వాస్తవం సీఎం మాటలకు విరుద్ధంగా ఉంది. పోలవరం ప్రాజెక్టులో ఏ నిర్మాణం చేపట్టాలన్నా ముందు కేంద్ర జలసంఘం, కేంద్రం నియమించిన డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతులు తీసుకోవాలి. డయాఫ్రం వాల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణ పనులు ప్రారంభించే క్రమంలో ముందే ఆ అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. పనులు జరుగుతుండగా ఆ కమిటీలు అనేకసార్లు వచ్చి పరిశీలించి వెళ్లాయి. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 2021 వరకు జరిగిన పరిణామాలపై మూడో పక్షంగా కేంద్రం హైదరాబాద్ ఐఐటీ నిపుణులతో అధ్యయనం చేయించింది. వారు అనేకసార్లు పోలవరాన్ని సందర్శించి, ప్రాజెక్టు నిర్మాణ జాప్యానికి కారణాలను విశ్లేషించారు. పోలవరంలో ఈ కోతకు కాఫర్ డ్యాం ముందే నిర్మించడం కారణమని.. వారు చెప్పలేదు. 2019 మేలో ఎగువ కాఫర్ డ్యాంలో ఉంచిన గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడం వల్లే ఈ విధ్వంసం జరిగిందని తేల్చిచెప్పారు. 2020లో గోదావరికి భారీ వరదలు రాగా... 22 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలతో కాఫర్ డ్యాం దిగువన, ప్రధాన డ్యాం గ్యాప్ 1, 2 ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇసుక కోత పడింది. మూడుచోట్ల నదీ గర్భం కోసుకుపోయింది. అయినప్పటికీ ఈ అంశాన్ని మానవ నియంత్రణలో లేని అంశాల కేటగిరీలో చేర్చలేమన్న హైదరాబాద్ ఐఐటీ... ప్రకృతి వైఫల్యంగానూ చూడలేమంది. అసమర్థ ప్రణాళికే ఈ విధ్వంసానికి కారణంగా పేర్కొంది. కాఫర్ డ్యాంలో ఉన్న గ్యాప్‌లను సకాలంలో పూడ్చలేకపోయినందున... ప్రధాన రాతి, మట్టి డ్యాం నిర్మాణం సకాలంలో పూర్తి చేయలేకపోవడానికి ఇది ప్రధాన కారణమైనట్లు తెలిపింది.