దిల్లీలో రెండో రోజుల పర్యటనను ముగించుకున్న సీఎం జగన్.. రాష్ట్రానికి చేరుకున్నారు. ఇవాల్టి కార్యక్రమాల్లో భాగంగా.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో సమావేశమయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్.. విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశాలపై చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు తాము సూచించిన ప్రత్యామ్నాయలను మరోసారి పరిశీలించాలని సీఎం కోరారు. కాకినాడ సెజ్‌లో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. వయోబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారంలేకుండా చూడాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. వయోబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలోనూ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. వచ్చే వారమే ఏపీ సీఎస్, పెట్రోలియం శాఖలోని కార్యదర్శులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌కు కేంద్రమంత్రి హామీ ఇచ్చారని అధికార వర్గాలు వెల్లడించాయి. దాదాపు గంటకు పైగా ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం చర్చించారు. అనంతరం కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం భేటీ అయ్యారు. అనంతరం దిల్లీ నుంచి తాడేపల్లికి చేరుకున్నారు.