ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జె.కె.మహేశ్వరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. నవ్యాంధ్ర హైకోర్టు ఆవిర్భావం నుంచి జస్టిస్ ప్రవీణ్ కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. పూర్తిస్థాయి సీజే నియామకం కోసం కసరత్తు చేపట్టిన సుప్రీంకోర్టు... అలహాబాద్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ విక్రమ్ నాథ్ ను నియమించాలని ఏప్రిల్ 8న కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే కొలీజియం సిఫార్సును వెనక్కి పంపించిన కేంద్ర ప్రభుత్వం... ఈ అంశంపై మళ్లీ పరిశీలించాలని కోరింది. దానితో మరోసారి వివిధ అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు కొలీజియం.. తాజాగా జస్టిస్ మహేశ్వరి పేరును సిఫార్సు చేసింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ మహేశ్వరి 1961 జూన్ 29న జన్మించారు. 1985 నవంబరు 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయిన ఆయన... సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసులను వాదించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 2005 నవంబరు 25న నియమితులయ్యారు. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణతో కూడిన కొలీజియం సిఫార్సు మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జె.కె.మహేశ్వరి నియమితులయ్యారు.