చికెన్ రేటు ఆల్‌టైమ్ రికార్డును సృష్టించింది. మునుపెన్నడు లేని విధంగా కిలో మాంసం రూ.257కు చేరింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కోళ్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ఫలితంగా రాష్ట్రంలో కోళ్ల పెంపకం 50 శాతానికి పడిపోయింది. దీనికి తోడు ఎండ తీవ్రత పెరిగి కోళ్లు తక్కువ బరువు వస్తున్నాయి. ఈ ప్రభావమే ప్రస్తుతం ధరలు పెరగడానికి దోహదపడింది.
కాస్త ఊరట..
చికెన్ తింటే కరోనా వస్తోందనే దుష్ప్రచారం, లాక్‌డౌన్ సంక్షోభంతో కోళ్లను ఉచితంగా ఇచ్చేసిన రైతులకు ఇప్పుడు కాస్త ఊరట లభిస్తోంది. శుక్రవారం కోళ్ల ఫారాల వద్ద లిఫ్టింగ్ ధర కిలోకు రూ.140 చొప్పున చెల్లించారు. శనివారం ఈ ధరను రూ.145గా నిర్ణయించారు. ఈ లెక్కన ప్రస్తుతం రూ.257 ఉన్న ధర రూ.260 దాటేందుకు అవకాశాలున్నాయి.