ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chicken And Meat Prices: ముక్క ముట్టాలంటే రూ. వెయ్యి పెట్టాల్సిందే! - హైదరాబాద్​లో మాంసం ధరలు

Chicken And Meat Prices: నిన్న మాంసం ధరలకు రెక్కలొచ్చాయి. ఆధివారం, కనుమ సందర్భంగా ఏకంగా కిలో మేక మాంసం రూ.800 నుంచి 950కి అమ్ముడుపోయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆదివారం ఒక్కరోజే 10వేల గొర్రెలు, మేకలకు పైగా కోసి మాంసం విక్రయించారని సమాచారం.

Chicken And Meat Prices
Chicken And Meat Prices

By

Published : Jan 17, 2022, 12:35 PM IST

Chicken And Meat Prices: తెలంగాణలో మాంసాహారానికి భారీ డిమాండు ఏర్పడింది. గొర్రెలు, మేక మాంసం రికార్డుస్థాయిలో ఆదివారం కిలో రూ.800 నుంచి 950కి అమ్ముడుపోయింది. మూడేళ్ల క్రితం కిలో ధర రూ.400-500 ఉండేది. ఇప్పుడు అంతకన్నా వందశాతం అదనంగా పెరిగింది. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో గొర్రెల సంఖ్య 2 కోట్లను దాటిందని, ఈ విషయంలో తెలంగాణ.. దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పశుసంవర్ధకశాఖ తెలిపింది. ‘డిమాండు - సరఫరా’ సూత్రం ప్రకారం వస్తువుల ఉత్పత్తి పెరిగితే ధర పడిపోవాలి. రాష్ట్రంలో గొర్రెల సంఖ్య భారీగా పెరిగినా.. ధర తగ్గాల్సింది పోయి, ఏకంగా రెట్టింపయింది. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో మాంసం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. సంక్రాంతికి ప్రత్యేకించి కనుమ పండగ సందర్భంగా మాంసాహారం తినడం కొన్ని వర్గాల ప్రజలకు ఆనవాయితీ. ఆదివారం రాష్ట్రంలో మాంసం విక్రయాలు గరిష్ఠస్థాయికి చేరాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆదివారం ఒక్కరోజే 10వేల గొర్రెలు, మేకలకు పైగా కోసి మాంసం విక్రయించారని టోకు వ్యాపారి ఒకరు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లారీలు, వ్యాన్లలో మేకలు, గొర్రెలను పెద్దసంఖ్యలో తెచ్చి విక్రయించారు. వాటి రవాణాకు కిరాయిలు పెరిగినందున.. అధిక ధరలకు జీవాలను విక్రయించారని, అందుకే మాంసం ధరనూ పెంచినట్లు దిల్‌సుఖ్‌నగర్‌ చెందిన ఓ చిల్లర వ్యాపారి స్పష్టం చేశారు. గత ఏడాది కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి గొర్రెలు, మేకల ధరలను వాటి పెంపకందారులు పెంచుతున్నారు. వాటికి వేసే దాణా, గ్రాసం ధరలు, రవాణా కిరాయిలు 30 శాతం దాకా పెరిగాయి.

విదేశాలకు విక్రయించే ధరల కన్నా దాదాపు రెట్టింపు..

ప్రపంచంలో ఎక్కడా లేనంతగా తెలంగాణలో మాంసం ధరలు మండిపోతున్నాయని జాతీయ మాంసం పరిశోధన కేంద్రం అధ్యయనంలో తేలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) తొలి 7 నెలలు గత ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకూ భారత్‌ నుంచి 4,903 టన్నుల గొర్రె, మేక మాంసాన్ని ఎగుమతి చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో మాంసం ధర రూ.514కి పలికిందని జాతీయ వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి మండలి(అపెడా) తాజా నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ధర ఇంతకు మించితే విదేశీ మార్కెట్లలో భారత మాంసాన్ని కొనడం లేదు. కానీ, హైదరాబాద్‌ మార్కెట్‌లో ఏకంగా రూ.800 నుంచి 950కి అమ్ముతుండటం గమనార్హం. దాణాఖర్చులు బాగా పెరగడంతో పాటు రాష్ట్రంలో జీవాల కొరత ఉన్నందున మాంసం ధరలు పెరుగుతున్నాయని రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు ఉడుత రవీందర్‌ తెలిపారు.

ధర ఎక్కువగా ఉన్నందునే ఎగుమతుల్లేవు

రాష్ట్రంలో మాంసం ధరలు ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. అందుకనే విదేశాలకు ఎగుమతి చేయలేకపోతున్నాం. ధరలను పురపాలక అధికారులు నియంత్రించాలి. మేకలు, గొర్రెలను పెంపకందారులు కబేళాలకు ఎంతకు అమ్ముతున్నారనే అంశంపై పశుసంవర్ధకశాఖ, సమాఖ్య కలసి అధ్యయనం చేశాయి. కిలో ధర రూ.700కి మించి అమ్మకుండా చూడాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశాం. అప్పట్లో అధికారులు దాడులు చేస్తే కొద్దిరోజులు ధరలు తగ్గించారు. మళ్లీ ఇప్పుడు పెంచేశారు. సంక్రాంతి సెలవులకు నగర ప్రజలు పెద్దసంఖ్యలో ఊళ్లకు వెళ్లారు. డిమాండు లేనందున ధర తగ్గించాల్సింది పోయి పెంచారు.- రాంచందర్‌, ఎండీ, రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య

ఇదీచూడండి:

బీఫ్​ తిన్నందుకు 24 మంది గిరిజనుల బహిష్కరణ

ABOUT THE AUTHOR

...view details