ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్రమ వసూళ్లకు చెక్​! - అక్రమ భూముల వసూళ్లకు చెక్

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం పెద్దఎత్తున భూములు సేకరిస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా పల్నాడులో ఓ పట్టణం శివారున సేకరించిన భూములకు సంబంధించి రైతులకు పరిహారం ఇచ్చేందుకు ఎకరాకు రూ.7 లక్షలు ఇవ్వాల్సిందేనని అక్రమాలకు తెరలేపారు. తెర వెనుక నియోజకవర్గ ప్రజాప్రతినిధి కథ నడుపుతున్నారు. ఈ వసూళ్ల వ్యవహారం పల్నాడుకు చెందిన మరో కీలక ప్రజాప్రతినిధి దృష్టికి చేరింది. అసలే ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేధాలు నడుస్తున్నాయి. వారి మధ్య వైరం.. రైతులకు రూ.కోట్లు కలిసొచ్చేలా చేసింది.. అదేంటో మీరే చూడండి..

Check for illegal collections of lands in amamravathi at guntur
అక్రమ వసూళ్లకు చెక్

By

Published : Jul 30, 2020, 9:01 AM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఒక పట్టణంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సమీప గ్రామంలో మూడు విడతలుగా భూమిని సేకరించారు. తొలి విడతలో రైతుల నుంచి వసూళ్లు లేకుండానే ప్రక్రియ పూర్తయింది. రెండో విడత సేకరించిన భూముల్లో నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నేత ఒకరు ప్రజాప్రతినిధి పేరు చెప్పి ఎకరాకు రూ.2.50 లక్షల సొమ్ము చొప్పున వసూలు చేశారు. మూడో విడతలో ఏకంగా ఎకరాకు రూ.7 లక్షలు రైతుల నుంచి వసూలు చేసేలా ఒప్పందం చేసుకుని ముందస్తుగా చెక్కులు సైతం తీసుకున్నారు. ప్రస్తుతం భూ యజమానుల ఖాతాలకు సొమ్ము జమ అవుతోంది. రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయం పల్నాడు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కీలక ప్రజాప్రతినిధి దృష్టికి వెళ్లింది. వసూళ్లకు మద్దతు పలుకుతున్న ప్రజాప్రతినిధితో వైరం తీవ్రస్థాయికి చేరింది. ఒకరికొకరు ఎదురుపడితే ఘర్షణలు సైతం చోటుచేసుకున్న సందర్భాలున్నాయి. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఇదో మంచి అవకాశమని సదరు కీలక ప్రజాప్రతినిధి వెంటనే రంగంలోకి దిగారు. బలవంతపు వసూళ్లు చేస్తే రైతుల తరఫున పోరాడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కులు వెనక్కి ఇవ్వకుంటే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి కేసులు పెట్టిస్తానని హెచ్చరించడంతో మొత్తం మీద వసూళ్లకు చెక్‌ పడింది.

కొంతైనా ఇవ్వాలని అభ్యర్థన..

రైతుల ఇచ్చిన చెక్కుల ద్వారా డబ్బులు డ్రా చేస్తే అక్రమ వసూళ్ల వ్యవహారం బయటకొస్తుందని, తద్వారా పోలీసు కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని సొమ్ము డ్రా చేయకుండా మిన్నకుండిపోయారు. ప్రస్తుతం ఓ పెద్దాయన వద్ద చెక్కులు ఉంచారు. రైతులకు వీటిని అందజేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. అయితే ఖర్చుల వరకు అయినా ఎంతో కొంత ఇవ్వాలని క్రియాశీలక నేత బేరం పెట్టినట్లు తెలిసింది. పరిహారం సొమ్ము రైతుల ఖాతాకు జమ కాగానే కనీసం ఖర్చులైనా ఇవ్వాలని రైతుల చుట్టూ మధ్యవర్తులు ప్రదక్షిణలు చేస్తున్నారు. చివరికి అందరి తరఫున రూ.30 లక్షలైనా ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఒకప్పుడు బెదిరించి చెక్కులు తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు సొమ్ము కోసం అభ్యర్థించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

కథ.. అడ్డం తిరిగింది..

బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు పతనం కావడంతో ప్రభుత్వం ఇస్తున్న ధరకు భూములు విక్రయించడానికి పలువురు భూ యజమానులు ముందుకు వచ్చారు. దీనిని అవకాశంగా తీసుకున్న ప్రజాప్రతినిధి ఒకరు నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్న నేత ద్వారా రైతుల నుంచి రూ.7లక్షల చొప్పున సుమారు 90 ఎకరాలకు సంబంధించి వసూలుకు రంగం సిద్ధమైంది. అంతా అనుకున్నట్లు జరిగితే రూ.6 కోట్ల సొమ్ము ప్రజాప్రతినిధికి దక్కేది. చివర్లో రంగంలోకి దిగిన కీలక ప్రజాప్రతినిధి వసూళ్లు వాస్తవమేనని నిర్ధారించుకున్న తరువాత నేరుగా రైతులకు ఫోన్లు చేసి భూ సేకరణకు సంబంధించిన ప్రక్రియ చివరి దశకు వచ్చిందని, సొమ్ము మీ ఖాతాలకే జమ చేస్తారని చెప్పారు. మధ్యవర్తులకు ఇచ్చిన చెక్కులు వెనక్కి తెచ్చుకోవాలని సూచించారు. ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని ధ్వజమెత్తారు. దీంతో వసూళ్లకు తెరతీసిన ప్రజాప్రతినిధి వెంటనే చెక్కులు రైతులకు వెనక్కి ఇవ్వాలని మధ్యవర్తులను ఆదేశించారు. సొమ్ము చేతికి వచ్చే దశలో అడ్డుపడటంపై వసూళ్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన ప్రజాప్రతినిధి మండిపడుతున్నట్లు తెలిసింది. మొత్తం మీద ప్రజాప్రతినిధులు ఇద్దరి మధ్య వైరం తమకెంతో లాభించిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఉపాధి హామీ పనులకు భారీగా తగ్గిన కూలీలు

ABOUT THE AUTHOR

...view details