Cheater Arrest: ఆన్‌లైన్ వివాహ పరిచయ వేదికలో పేరు నమోదు చేసుకున్న యువతులే అతని లక్ష్యం. పరిచయం చేసుకుని ముందుగా ఛాటింగ్ తో షురూ చేస్తాడు. తర్వాత మాటలతో మాయచేస్తాడు. అమెరికాలో నీకూ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశపెట్టి అందినకాడికి దోచుకుని ముఖం చాటేస్తాడు. అలా తెలుగు రాష్ట్రాల్లో ఎందరినో మోసగించిన అతగాడి బండారం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
ఇలా చిక్కాడు..
పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి వెల్లడించిన వివరాల ప్రకారం... సుల్తానాబాద్‌కు చెందిన యువతి వివాహ సంబంధాల కోసం 2020లో ఓ మ్యాట్రిమోనీలో పేరు నమోదు చేసుకున్నారు. ఖమ్మంకు చెందిన వాసిరెడ్డి రాహుల్ ఆమెతో ఛాటింగ్ చేశాడు. స్నేహం కుదిరాక పెళ్లి చేసుకుందామనే ప్రతిపాదన తెచ్చాడు. ఈ క్రమంలోనే తరచూ తన అవసరాలకు డబ్బులు తీసుకొని తిరిగి ఇచ్చేవాడు. కొన్నాళ్ల తర్వాత తనకు అమెరికాలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని, వీసా ఇతర ఖర్చులకు రూ.6 లక్షలు అవసరమని నమ్మించాడు. అమెరికా వెళ్లాక నీకూ అక్కడే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మరో రూ.7.5 లక్షలు నగదు తీసుకున్నాడు. ఆ క్రమంలో యువతి తన వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టుపెట్టి మరీ అతను అడిగిన మొత్తాన్ని ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత ఫోన్ ఎత్తకపోవడంతో తాను మోసపోయినట్టు గుర్తించిన యువతి సుల్తానాబాద్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూడు బృందాలతో హైదరాబాద్, ఖమ్మం, విజయవాడలలో గాలించి ఎట్టకేలకు నిందితుడు రాహుల్‌ను పట్టుకున్నామని’ ఏసీపీ తెలిపారు. నిందితుడు రాహుల్‌పై 2010లో ఖమ్మంలో, 2012లో హైదరాబాద్ ఎల్బీనగర్‌లో, 2013లో విజయవాడలో ఇదే తరహాలో కేసులు నమోదైనట్లు ఏసీపీ వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేటుగాడి బాధితులు అనేక మంది ఉన్నారన్నారు.