Train Charges Hike For Sankranti : సంక్రాంతికి కుటుంబంతో విజయవాడ వెళ్లేందుకు సిద్ధమైన ప్రైవేటు ఉద్యోగి రైలు టికెట్ల కోసం ప్రయత్నించారు. రెగ్యులర్ బండ్లలో రిజర్వేషన్ పూర్తవడంతో 11వతేదీ నాటికి సువిధ ప్రత్యేక రైలు (నెం.82714)లో టికెట్ బుక్ చేద్దామనుకున్నారు. సాధారణ రైల్లో రూ.225గా ఉన్న స్లీపర్ టికెట్ ధర, ఇందులో రూ.1,135 చూపిస్తుండటంతో(సుమారు 5 రెట్లు అదనం) అవాక్కయ్యారు. అంత చెల్లించినా ఇచ్చేది వెయిటింగ్ లిస్ట్ టికెట్లే కావడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Train Charges Hike For Sankranti in Telangana : సికింద్రాబాద్-తిరుపతికి రెగ్యులర్ రైళ్లలో స్లీపర్ టికెట్ రూ.425 ఉండగా, 11న వెళ్లే సువిధ (నెం.82720) రైల్లో రూ.1000గా ఉంది. రూ.1,580గా ఉన్న థర్డ్‌ఏసీ టికెట్ ధరను రూ.2,935కు పెంచారు.
పండగ రద్దీని సొమ్ము చేసుకుంటూ
Train Charges Hike For Sankranti in AP : సంక్రాంతి పండక్కి తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. ఎక్కువ మంది 11, 12, 13 తేదీల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రైవేటు ట్రావెల్ బస్సుల్లో టికెట్ ధరలు భారీగా పెరగడం, రెగ్యులర్ రైళ్లలో చాలారోజుల క్రితమే రిజర్వేషన్లు పూర్తవడంతో ప్రత్యేక రైళ్ల కోసం సోధిస్తున్నారు. ఇదే అదునుగా ద.మ.రైల్వే అదనపు రైళ్ల పేరుతో.. ‘సువిధ’ ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తూ అడ్డంగా దోచుకుంటోంది. ఉదాహరణకు కాచిగూడ నుంచి నర్సాపూర్‌కు రెగ్యులర్ రైల్లో ఫస్ట్ ఏసీ టికెట్ రూ.1,930 అయితే, సువిధ రైల్లో సెకండ్ ఏసీ ధరే రూ.2,890గా ఉండటం దోపిడీకి నిదర్శనమని ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సికింద్రాబాద్-విజయవాడల మధ్యే కాదు, హైదరాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం, కాకినాడ, నర్సాపూర్, తిరుపతి వంటి మార్గాల్లో ప్రయాణించే ‘సువిధ’ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంది. పండక్కి వెళ్లేటప్పుడే కాదు తిరుగు ప్రయాణంలోనూ టికెట్ ధరలు ఇదే తరహాలో ఉన్నాయి. 16న తిరుపతి-కాచిగూడ (నెం.82721), 17న నర్సాపూర్-సికింద్రాబాద్ (82722) సహా మరికొన్ని సువిధ రైళ్లలోనూ టికెట్ ధరలు నాలుగైదు రెట్లు అధికంగా ఉండటంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.