ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కీలక ఉత్తర్వులు: ఇకపై ముఖ్యమంత్రికే ఆ అధికారం..!

ఏపీ కేడర్​కు చెందిన అఖిల భారత సర్వీసు అధికారుల భవితవ్యం ఇక ముఖ్యమంత్రి గుప్పిట్లోనే ఉండనుంది. అధికారులకు సంబంధించిన వార్షిక పనితీరు నివేదికను ఆమోదించే అధికారాన్ని సీఎంకు కట్టబెడుతూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సబ్ కలెక్టర్ స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకూ, అదనపు ఎస్పీ నుంచి డీజీపీ వరకూ ఉన్నతాధికారులంతా ఇక ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ తరహా అధికారుల పనితీరు మదింపు నివేదికను ఆమోదించే అధికారం సీఎంకు ఇవ్వటం దేశంలోనే తొలిసారని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.

అఖిల భారత సర్వీస్ అధికారుల వార్షిక నివేదిక
అఖిల భారత సర్వీస్ అధికారుల వార్షిక నివేదిక

By

Published : Apr 10, 2021, 3:04 PM IST

Updated : Apr 10, 2021, 9:48 PM IST


అఖిల భారత సర్వీసు అధికారుల పనితీరు మదింపు నివేదికను ఆమోదించే అధికారాన్ని ముఖ్యమంత్రికి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ కేడర్​కు చెందిన ప్రతీ అఖిల భారత సర్వీసు అధికారి పనితీరు నివేదిక ఇకనుంచి సీఎం ఆమోదించనున్నారు. ఈ మేరకు ఏపీ కేడర్​కు చెందిన అఖిలభారత సర్వీసు అధికారుల సర్వీసు నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కేడర్​లోని అఖిల భారత సర్వీసు అధికారి పనితీరు నివేదికను ఆమోదించే అధికారాన్ని ముఖ్యమంత్రికి ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్​ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ నివేదికే కీలకం

ఏపీలోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల వార్షిక పనితీరు నివేదికలను ఇకనుంచి ముఖ్యమంత్రికి నివేదించేలా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అఖిల భారత సర్వీసు నిబంధనలు 2007 ప్రకారం అధికారుల పనితీరు, స్వభావం, ప్రవర్తన తదితర అంశాలను మదింపు చేసే అధికారాన్ని ముఖ్యమంత్రికి ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు. సబ్ కలెక్టర్ నుంచి సీఎస్ వరకూ, ఏఎస్పీ నుంచి డీజీపీ వరకూ, సబ్ డీఎఫ్ఓ నుంచి పీసీసీఎఫ్ ఉప అటవీ అధికారి నుంచి ముఖ్య అటవీ సంరక్షణాధికారి వరకూ అందరి పనితీరు నివేదికలను ఆమోదించే అధికారం ముఖ్యమంత్రి వద్ద ఉంటుందని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసుల్లోని వేర్వేరు హోదాలు, ర్యాంకులకు సంబంధించిన రిపోర్టింగ్ అధికారులు ఉన్నప్పటికీ పనితీరు నివేదికలను మాత్రం సీఎం ఆమోదిస్తారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. పౌర సేవలు మరింతగా ప్రజలకు చేరటం, పాలనాయంత్రాంగంపై నియంత్రణ లాంటి అంశాల్లో మెరుగైన ఫలితాల కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఒక్క గవర్నర్ కార్యదర్శికి సంబందించిన పనితీరు నివేదికను మాత్రమే రాష్ట్ర గవర్నర్ ఆమోదిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సర్వీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్​లు, కేంద్ర సర్వీసుల వంటి పరిణామాల్లో అధికారులకు ఈ నివేదిక కీలకం కానుంది.

సీఎం నియంత్రణలోనే..

వాస్తవానికి సర్వీసులో చేరిన సబ్ కలెక్టర్ స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఇతర ఐఎఎస్ అధికారుల వార్షిక నివేదికల్ని సీఎస్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల కమిటీ పర్యవేక్షించేది. ఒక స్థాయి దాటిన ఉన్నతాధికారుల పనితీరు నివేదికలు మాత్రమే ముఖ్యమంత్రికి పంపేలా విధానం అమలు అయ్యేది. ప్రస్తుతం సబ్ కలెక్టర్ నుంచి సీఎస్ వరకూ, అదనపు ఎస్పీ నుంచి డీజీపీ వరకూ అధికారుల వార్షిక పనితీరు మదింపు నివేదికలన్నీ ఇక ముఖ్యమంత్రి ఆమోదానికి వెళ్లేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఐఎఎస్ అధికారులకు సంబంధించిన బదిలీలు, క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన అధికారాలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ వారి పనితీరు సమీక్షించే అధికారాలను కేంద్ర ప్రభుత్వం బదలాయించలేదు. తాజా ఆదేశాల మేరకు పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్టు యాక్సెప్టింగ్ అథారిటీగా ముఖ్యమంత్రినే నియమించటంతో ఇక అఖిల భారత సర్వీసు అధికారులంతా సీఎం నియంత్రణలోనే ఉండనున్నారు.

ఇదీ చదవండీ... సీబీఐ దర్యాప్తు జరపకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తా: ఏబీ వెంకటేశ్వరరావు

Last Updated : Apr 10, 2021, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details