రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి, ఫ్రంట్‌లైన్ వారియర్ల భద్రత, టెస్టింగ్ సరళిలో మార్పులు, చికిత్సా సౌకర్యాల మెరుగుపై ఆయన సీఎస్ నీలం సాహ్నికు లేఖ రాశారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో.... జీవనోపాధి సాయం కింద ప్రతి పేద కుటుంబానికి 10వేల రూపాయల చొప్పున అందించాలని....తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 2020 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జీవనోపాధి నిమిత్తం భత్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య మౌలిక సౌకర్యాల పెంపు, కరోనా వైద్యం ఖర్చులు భరించలేని స్థితి, జీవనోపాధిని, ఉద్యోగాలను కోల్పోవడం అంశాలపై తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని కోరారు. భారమైన హృదయంతో, తీవ్ర వేదనతో ఈ లేఖ రాస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. కొవిడ్ ప్రారంభం నుంచి ప్రభుత్వానికి సూచనలు ఇస్తూనే ఉన్నానని...ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని.. పర్యవసానంగా రాష్ట్రం మొత్తం కరోనా వ్యాపించిందని లేఖలో పేర్కొన్నారు.
వారికి ఆరోగ్య భద్రత కల్పించండి...
కొవిడ్ కేసులు 4 లక్షలు దాటిపోయినా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఫ్రంట్ లైన్ వారియర్ల ఆరోగ్య భద్రత అతి ముఖ్యాంశమని... వారందరికీ పీపీఈలు అందించాలన్నారు. ఎక్కువ గంటలు పనిచేయాలని వాళ్లను వేధించరాదని, తగినంత విరామం లభించేలా చూడాలని సూచించారు. వారి కుటుంబ సభ్యులకు సరైన ఆరోగ్య సౌకర్యాలు, ఆర్థిక భద్రత కల్పించాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్లకు రూ.50లక్షల ఆర్ధిక సాయం వెంటనే అందించాలన్నారు.
జూడాల సమస్యను పరిష్కరించండి...
గ్రామాల్లో ఆశా వర్కర్లే మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు వెన్నెముకని... వారిని వేధింపులకు గురి చేయరాదన్నారు. 8నెలలుగా రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెండింగ్లో ఉందని... దీనికోసం జూనియర్ డాక్టర్లు ఆందోళనలు చేస్తున్న విషయాన్ని లేఖ ద్వారా తెలియజేశారు. కరోనా వైద్యసేవలలో జూడాలదే కీలక పాత్రన్నారు. కాబట్టి వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. నాసిరకం పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్ ల కొరతను వెంటనే పరిష్కరించాలని లేఖ ద్వారా సీఎస్కు చంద్రబాబు కోరారు.
ఇవీ చదవండి:అచ్చెన్నకు చంద్రబాబు ఫోన్.. ఆరోగ్యంపై ఆరా!