సీఎం జగన్‌కి చంద్రబాబులేఖ ముఖ్యమంత్రి జగన్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఐదు అంశాలకు పరిష్కారం చూపాలని లేఖలో పేర్కొన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి కరోనాపై పోరాడుతున్న వైద్యులు, సిబ్బంది రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. విశాఖ మెడ్ టెక్ జోన్ గత 11 నెలలుగా నిర్లక్ష్యానికి గురైందన్న చంద్రబాబు.. ప్రజోపయోగమైన ప్రాజెక్టులు ఆపేయడం సమాజానికి చేటన్నారు. అన్న క్యాంటీన్ల మూసివేతతో రూ.5కే అన్నం లభించే అవకాశం లేకుండా పోయిందని లేఖలో పేర్కొన్నారు. ఆర్టీజీ నిర్వీర్యం కావడం వల్ల ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధి దూరమైందని ఆవేదన చెందారు.
శాఖల మధ్య సమన్వయం అత్యవసరం : చంద్రబాబు
పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ పరిస్థితుల్లో పాలకులు మీనమేషాలు లెక్కించడం భావ్యం కాదని హితవు పలికారు. దళారులు, అక్రమ వ్యాపారులు బ్లాక్ మార్కెట్ విక్రయాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బ్లాక్ మార్కెట్ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని సీఎం జగన్‌ను కోరారు. నిత్యావసరాలు, కూరగాయలు ఇళ్ల వద్దకే అందుబాటులోకి తేవాలన్నారు. నిత్యావసరాల సరఫరాకు సిటీ బస్సులు, పల్లె వెలుగు సర్వీసులు వినియోగించాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల మధ్య సమన్వయం అత్యవసరమన్న చంద్రబాబు... సమన్వయలోపం ఉంటే కరోనాను కట్టడి చేయలేమని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:
ప్రాణాలు నిలబెట్టే వైద్యులకేదీ రక్షణ: పవన్