ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా పాత్రికేయులకు తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. వృత్తిపరమైన ఒత్తిళ్లను అధిగమించి, పాలకుల వేధింపులను తట్టుకుని, నిష్పాక్షికంగా వార్తలను అందిస్తూ ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు చేస్తున్న కృషి నిరుపమానమని కొనియాడారు.
సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో, అణగారిన వర్గాల హక్కుల సాధనలో కీలక భూమిక మీడియాదేనన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల్లో చైతన్యం కోసం కృషి చేస్తూ... ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. కరోనాపై పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్థంభం మీడియా అని పేర్కొన్నారు.
పత్రికా స్వేచ్ఛకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. పత్రికా స్వేచ్ఛకు ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా ముందుండి పోరాడిందని... రాజశేఖర రెడ్డి హయాంలో జీవో 938కు వ్యతిరేకంగా, జగన్ మోహన్ రెడ్డి పాలనలో జీవో 2430కు వ్యతిరేకంగా పోరాటం చేశామని గుర్తుచేశారు. పాత్రికేయులపై, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రశ్నించే గొంతును నొక్కాలని చూడటం హేయమని చంద్రబాబు మండిపడ్డారు. విమర్శను స్ఫోర్టివ్గా తీసుకోవాలని... సద్విమర్శను స్వాగతించి, పరిపాలనలో తప్పులు దిద్దుకోవాలని హితవు పలికారు. తప్పుడు కేసులతో మీడియాను అణచేయాలని చూడటం హేయమైన చర్య అని అభిప్రాయపడ్డారు. ఎక్కడ పత్రికలకు నిజమైన స్వేచ్ఛ ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పేర్కొన్నారు. పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టడం ఇప్పటికైనా మానుకోవాలని చంద్రబాబు సూచించారు.
ఇదీ చదవండి : ఎక్కడి వారు అక్కడే ఉండండి: సీఎం జగన్