'వైకాపా అరాచకపాలనపై తాను చేస్తున్న ధర్మపోరాటానికి ప్రజలంతా సహకరించాలి. క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తాను.. అంతవరకూ వెళ్లను. ప్రజలు సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తా' అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నాడు ఎన్టీఆర్ ఈ తరహాలోనే వ్యాఖ్యలు చేయటం.. తిరిగి తెదేపా అధికారంలోకి రావటం వంటి పరిణామాలు చర్చకు దారి తీశాయి. అసలు నాడు ఎన్టీఆర్.. సభను ఎందుకు వాకౌట్ చేశారు..? ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. చేసిన శపథం ఏంటో చూస్తే...!
ఎమ్మెల్యే శివారెడ్డి హత్య..
1993 ఆగస్టు 7వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహా కార్యక్రమానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే శివారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ప్రత్యర్థులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే శివారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎన్టీఆర్‌ను తీవ్రంగా కలిచివేసింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రభుత్వమే(కాంగ్రెస్) బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో శివారెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు యత్నించారు. అడ్డుకున్న ఎన్టీఆర్.. రాజ్‌భవన్ వరకూ శవయాత్ర జరపాలన్నారు. పోలీసులు తొలుత ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకించినా.. తరువాత అనుమతించారు. ఫలితంగా శవయాత్ర రాజ్ భవన్ వరకూ సాగింది. హంతకులకు కఠిన శిక్ష పడేలా చూడాలని నాటి గవర్నర్ కష్ణకాంత్ను ఎన్టీఆర్ కోరారు. గవర్నర్ సూచనతో ఎన్టీఆర్ ఆందోళన విరమించారు.
అసెంబ్లీలో ప్రకంపనలు.. సభ నుంచి వాకౌట్
శివారెడ్డి హత్య అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని ఎన్టీఆర్ పట్టుబట్టారు. నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్పందిస్తూ.. హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశాయని పేర్కొంటూ.. న్యాయవిచారణ డిమాండ్‌ను తిరస్కరించారు. సీఎం నిర్ణయంపై తెదేపా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో తెదేపా సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. మార్షల్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్టీఆర్ తన సీటు నుంచి కదల్లేదు. అయినా సస్పెన్షన్ వేటు పడింది. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఏ కారణంగా తనను సస్పెండ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్.. ఈ సభలో నాయకులకు గౌరవం లేదని.. సభ్యులు లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పటం లేదన్నారు. అకారణంగా సస్పెండ్ చేశారని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సర్కార్ తీరును నిరసిస్తూ.. సభను బహిష్కరించారు.ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం సభలో అడుగుపెట్టనని శపథం చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెదేపా విజయం సాధించటంతో అసెంబ్లీలో అడుగుపెట్టి.. తన శపథాన్ని నేరవెర్చుకున్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలు..ఎందుకంటే..