ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన తర్వాత...తెలుగుదేశం అధినేత చంద్రబాబు తొలిసారిగా ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఇవాళ విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. పేదల ఇళ్లస్థలాల కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై పలు ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ... విశాఖ జిల్లా పెందుర్తిలో బాధితులతో చంద్రబాబు మాట్లాడనున్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో శృంగవరపుకోట, గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఎస్.కోట, కొత్తవలసలో అన్న క్యాంటీన్‌ల తొలగింపుపై నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం సహా... మూడు చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడతారు.
అనుమతిపై ఉత్కంఠ...
చంద్రబాబు పర్యటనకు అనుమతిపై రాత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది. ఎట్టకేలకు రాత్రి 10 గంటల సమయంలో యాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. పార్టీ అధినేతకు స్వాగతం పలికేందుకు కేవలం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులకు మాత్రమే అవకాశం కల్పిస్తామని పోలీసులు చెప్పడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ పోలీసు కమిషనర్ ఆర్. కె. మీనాను కలిసి... అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటన వేళ అశాంతి సృష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు చేస్తోందని... వారిని పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని తెదేపా నేతలు ప్రశ్నించారు.