అమరావతిని పోటీపడి అభివృద్ధి చేస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిపై అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలతో దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తిపైనో, పార్టీపైనో కక్షతో చట్ట విరుద్ధంగా రాష్ట్ర రాజధాని నిర్మాణ బృహత్తర యజ్ఞాన్ని భగ్నం చేయడం తుగ్లక్ చర్యేనని ఆయన విమర్శించారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి 5 ఏళ్లు అయిందని గుర్తు చేసిన చంద్రబాబు... విభజన నష్టాన్ని అధిగమించి, 13 జిల్లాల అభివృద్ధికి సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగ అవకాశాల కార్యస్థానంగా రాజధాని నిర్మాణం తలపెట్టామన్నారు.
మూడున్నర సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిన నిర్మాణ పనులను గత ఏడాదిన్నరగా ఆపేశారని చంద్రబాబు విమర్శించారు. వేలాది కూలీలు, భారీ మెషీనరీతో, వాహనాల రాకపోకలతో కోలాహలంగా నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతిని స్తబ్దుగా చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శంకుస్థాపన వేడుకకు హాజరైన ప్రధాని, దేశ, విదేశీ ప్రముఖుల సందేశాల స్ఫూర్తిని కాలరాశారని ఆక్షేపించారు.