ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అంటూ అమరావతి రైతులు మోగించిన రణభేరికి.... ఏడాది పూర్తైంది. ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన ఉపసంహరించుకునే వరకూ వెనక్కి తగ్గేది లేదని ఉద్యమిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస సంయుక్తంగా నేడు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. అమరావతికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనిపాలెంలో సభ నిర్వహణకు పోలీసులు అనుమతించలేదు. రాయపూడి పెట్రోల్ బంకు వెనుక వైపు సీడ్ యాక్సిస్ రోడ్డులో వేదిక ఏర్పాటు చేశారు.
29 గ్రామాల్లో రోజూ వేర్వేరుగా దీక్షలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్న 29 గ్రామాల రైతులు, మహిళలు ర్యాలీగా సభాస్థలికి చేరుకుని ఒక్కటై నినదిస్తారు. సీడ్ యాక్సిస్ రోడ్డు పొడవునా టెంట్లు వేశారు. ముందు భాగంలో కూర్చునేందుకు కార్పెట్లు పరిచారు. వెనుక వైపు కుర్చీలు వేశారు. అమరావతి ఆవశ్యకత తెలియజెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. రాజధాని దళిత ఐకాస నేతలు ప్రధాన వేదిక పక్కనే మరో వేదికపై సాయంత్రం వరకూ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.