అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ నిలిపేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సింగపూర్ కన్సార్షియంతో ఎంవోయూ రద్దు చేశారన్న ప్రతిపక్ష నేత... రాష్ట్రాభివృద్ధికి ఇది ఊహించని శరాఘాతమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఎక్కడా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో తక్షణమే ఇసుక ఉచితంగా ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుక కృత్రిమ కొరతను వైకాపా నేతలే సృష్టించారని ధ్వజమెత్తారు.
'భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకే దీక్ష' - తెదేపా అధినేత చంద్రబాబు
రాష్ట్రంలో తక్షణమే ఇసుక ఉచితంగా ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అమరావతి నుంచి తెదేపా నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకే దీక్ష చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.
ఇసుక మాఫియాగా ఏర్పడి దోపిడీ చేస్తున్నారన్న చంద్రబాబు... కార్మికులకు సంఘీభావంగా ర్యాలీలు జరపాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలన్నారు. పనులు కోల్పోయినవారికి నెలకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలన్న చంద్రబాబు... 12 గంటల నిరసన దీక్షలో అన్నివర్గాల ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.