Babu Tour: తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా.. ప్రతి జిల్లాలో మినీ మహానాడు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమైంది. జిల్లా పర్యటనల్లో.. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 26 జిల్లాలలో ఏడాది పాటు విస్తృత పర్యటనలకు నిర్ణయించారు. ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లా టూర్లు చేపట్టాలని నిర్దేశించారు. ఈ నెల మూడో వారం నుంచే చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది.
ఈ నెల 15 నుంచి చంద్రబాబు మలివిడత జిల్లా పర్యటన చేయనున్నారు. 15న చోడవరంలో జిల్లా మహానాడులో పాల్గొననున్నారు. అందులో భాగంగా.. బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈనెల 16న అనకాపల్లిలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు. ఈనెల 17న చీపురుపల్లిలో 'బాదుడే బాదుడు' నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఏడాదిలో 80కి పైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా అధినేత పర్యటన సాగనుంది. అటు జిల్లాల పర్యటనలు, ఇటు కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవహారాలు సమాంతరంగా సాగేలా షెడ్యూల్ రూపొందించారు.