కరోనా సమయంలో రైతులను ఆదుకోవడంలో సీఎం జగన్ విఫలమయ్యారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పంటల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు ఉత్పత్తుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. మోటార్లకు మీటర్లు బిగించే పథకం రద్దు చేయాలని సూచించారు. నదీ జలాల హక్కుల్ని తాకట్టు పెట్టరాదని హితవు పలికారు.
రాష్ట్రంలో ఏ పంటకూ మద్దతు ధర దక్కడం లేదన్న చంద్రబాబు.. రైతు భరోసా కింద రాష్ట్ర నిధుల నుంచి 13500 ఇస్తామని చెప్పి 7,500 మాత్రమే చెల్లింపులు చేస్తున్నారని ఎద్దేవా చేసారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో విఫమయ్యారని ధ్వజమెత్తారు. రాయలసీమలో సబ్సీడీపై పంపిణీ చేసే డ్రిప్, యంత్ర పరికరాలను నిలిపివేశారని మండిపడ్డారు. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తామని మాట తప్పారని విమర్శించారు.