chandrababu on cm jagan: రాష్ట్ర ప్రజలు వరదల్లో ఇబ్బంది పడుతుంటే.. ముఖ్యమంత్రి మాత్రం ప్రశాంతంగా ఉంటున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. జగన్ పరామర్శలో.. జనాలు ఎవరినీ బయటకు రానీయకుండా అడ్డుకుంటున్నారన్న సీఎం.. బాధితులకంటే ఎక్కువ పోలీసులనే పెట్టి ఓదార్పు చేస్తున్నారని మండిపడ్డారు. పెన్నా నదిలో కరకట్టలకు ప్రమాదం జరిగేలా ఇసుక తవ్వకాలు జరిపారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ స్థాయి వరదలు ఉంటే.. సీఎం సిగ్గులేకుండా నాడు పెళ్లికి పోయారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకరైతే ఇలాంటి ఘటనకు సిగ్గుతో తల వంచుకుంటారన్నారు. ఒక మూసలావిడ నవ్వుతూ సీఎంను పొగిడింది అని చెపుతున్నారు.. ఇది జగన్ తరహా రాజకీయమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వరదలకు ప్రాణాలు, ఆస్తులు పోయి ఉంటే.. జనం జగన్ను చూసి మురిసిపోతారా..? స్వాగతం పలుకుతారా? అని నిలదీశారు.
ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన జగన్ ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అనర్హులని అన్నారు. తుమ్మల కుంట చెరువును క్రికెట్ స్టేడియంలా మార్చారని, దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఒక్క నెల్లూరులోనే 2 వేల కోట్ల నష్టం జరిగిందని.. ప్రాణాలకు రక్షణ కాదు.. డెడ్ బాడీ కూడా ఇవ్వలేని ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని దుయ్యబట్టారు.
కేంద్ర మంత్రి ప్రకటనకు ఏం చెపుతారు..?
chandrababu on floods: ప్రభుత్వ అసమర్థత, తప్పిదాల వల్లనే వరదల్లో 62 మంది చనిపోయారని బాబు ఆరోపించారు. రూ. 6వేల కోట్ల విలువైన పంట, ఆస్తి నష్టం జరిగిందని అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి వళ్లంతా ఇగో అన్న ఆయన... అందుకే వైకాపా ప్రభుత్వ చర్యలను తుగ్లక్ చర్యలు అన్నామన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రాణ నష్టం అని కేంద్ర మంత్రి చేసిన ప్రకటనకు ఏమి సమాధానం చెపుతారని చంద్రబాబు ప్రశ్నించారు. తెలిసో...తెలియకో ఓట్లు వేసిన పాపానికి ప్రజల ప్రాణాలు బలిగొంటారా అంటూ మండిపడ్డారు. జ్యుడీషియల్ ఎంక్వయిరీ అడిగితే ఎందుకు అంగీకరించలేదని చంద్రబాబు నిలదీశారు.
సీఎం పైశాచికానందం..
గతేడాది వరదలు వచ్చినప్పుడు కూడా అన్నమయ్య ప్రాజెక్టు ఐదో గేటు పని చేయలేదని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పుడు మూడు గేట్లు పని చేయకుంటే రెండు గేట్లని రిపేర్ చేయించి, ఓ గేట్ వదిలేశారని.. దాని కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్నారు. వర్షాల సమయంలో తమను ఎవ్వరూ హెచ్చరించలేదని నా పర్యటన సందర్భంగా బాధితులు చెప్పారని బాబు గుర్తుచేశారు. ఒకే కుటుంబంలో 9 మంది చనిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. 330 మీటర్ల కరకట్ట కొట్టుకెళ్లిందన్నారు. గత నెల 19న వరద వచ్చి ప్రాజెక్టు కొట్టుకుపోతే.. కుప్పంలో ఓడిపోయారు కాబట్టి తన మొహం చూడాలంటారా? అంటూ విమర్శించారు. సీఎం పైశాచికానందం పొందారని చంద్రబాబు మండిపడ్డారు.
గేటుకు గ్రీజు వేయలేని సీఎం మూడు రాజధానులు కడతారా?
గేటుకు గ్రీజు వేయలేని సీఎం మూడు రాజధానులు కడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏడాది కాలంగా గేట్ రిపేర్ చేయించలేకపోయారని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యంలో ఖర్చు పెట్టాల్సిన రూ. 1100 కోట్లను నిధులను కూడా మళ్లించారని దుయ్యబట్టారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ తప్పిదం వల్ల చనిపోతే.. కోటి రూపాయలు నష్ట పరిహరం ఇచ్చారన్నారు. వరద మృతుల కుటుంబాలకు కూడా కోటి రూపాయలు నష్టపరిహరం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.