Chandrababu on Amaravati: ‘రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్రమోదీ ఒక మాట అన్నారు. పవిత్రమైన యమునా జలాల్ని, చట్టాలు చేసే పార్లమెంటు ఆవరణ నుంచి మట్టి తెచ్చానని చెప్పారు. పార్లమెంటు ఎప్పుడూ అమరావతికి అండగా ఉంటుందని చెప్పడమే దాని ఉద్దేశమన్నారు. ఆ మాటలు నా చెవుల్లో ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఆ సంకల్పం వృథా పోదు. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. అమరావతి పరిరక్షణకు రైతులు చేస్తున్న పోరాటం విజయం సాధిస్తుంది’ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా నాయకులు ఆరోపిస్తున్నట్టుగా అమరావతి ఏ ఒక్క కులానికో పరిమితం కాదన్నారు. ‘కులాలు, పార్టీల వారూ ఉన్నారు.
అమరావతిని ఐదుకోట్ల మందికి మేలు చేసే ప్రజారాజధానిగా నిర్మించాలనుకున్నాం. ప్రాంతమో, కులమో చూసుకుంటే... తిరుపతిలోనే రాజధానిని పెట్టుకునేవాడిని. నారావారిపల్లె నుంచి రంగంపేట, తిరుపతి వరకు వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. కానీ నేను శాశ్వతం కాదు. నవ్యాంధ్రకు రాజధాని శాశ్వతం. అది రాష్ట్రానికి మధ్యలో ఉండాలని ఆలోచించే విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఎంపిక చేశాం’ అన్నారు. సీనియర్ పాత్రికేయుడు కందుల రమేష్ రచించిన ‘అమరావతి: వివాదాలు-వాస్తవాలు’ అన్న పుస్తకాన్ని గురువారం విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమరావతిపై వైకాపా నాయకులు, ప్రభుత్వం ప్రజల్లో సృష్టించిన అపోహల్ని కందుల రమేష్ తన పుస్తకంతో తొలగించారని, వాస్తవాల్ని వివరించారని పేర్కొన్నారు.
జగన్ చెప్పిదానికంటే ఎక్కువ భూమే ఉన్నా అభ్యంతరమేంటి?
గుంటూరు-విజయవాడ మధ్య 30వేల ఎకరాల్లో రాజధాని పెడితే తమకు అభ్యంతరం లేదని ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీలో చెప్పారని, రైతులు ఇచ్చినది, ప్రభుత్వ భూమి కలిపి రాజధానికి 54 వేల ఎకరాలు సమీకరించామని, జగన్ చెప్పినదానికన్నా 24 వేల ఎకరాలు ఎక్కువ రాజధాని తలపెట్టినప్పుడు ఆయనకు అభ్యంతరమేంటని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘అమరావతి ఏ ఒక్కరికో పరిమితం కాదు. అలా అనుకుంటే హైదరాబాద్‌ని ఏ కులం కోసం అభివృద్ధి చేశాను? అమరావతిని అంత అభివృద్ధి చేశాక కూడా గత ఎన్నికల్లో ఎస్సీ స్థానమైన తాడికొండలో తెదేపా ఓడిపోయింది. హైదరాబాద్‌ని అభివృద్ధి చేశాక... 2004 ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో ఓడిపోయాం. కాబట్టి అభివృద్ధికి, ఎన్నికలకు సంబంధం లేదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
వైఎస్ ఆపేస్తే...హైదరాబాద్ అభివృద్ధి జరిగేదా?
‘వైఎస్ హయాంలో కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్‌లో నేను ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల్ని నిలిపివేయాలన్న చర్చ వైఎస్ ఎప్పుడైనా చేశారా? అని ఆయనను ఇప్పుడే అడిగాను. అలా ఎప్పుడూ లేదని చెప్పారు. వైఎస్‌గానీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు గానీ నేను ప్రారంభించిన కార్యక్రమాల్ని నిలిపివేస్తే, హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందేది కాదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో పాటు... కొత్తగా సైబరాబాద్ నిర్మించాం. హైదరాబాద్‌ని అంతగా అభివృద్ధి చేయడం వల్లే రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చిందని నన్ను విమర్శించినవాళ్లూ ఉన్నారు. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్, తిరుపతి, విశాఖ, విజయవాడ వంటి నగరాల్నీ అభివృద్ధి చేయాలనుకున్నాం’ అని తెలిపారు. అమరావతి దేవతల రాజధాని. నవ్యాంధ్ర రాజధానికి ఆ పేరు బాగుంటుందని రామోజీరావు సూచించారు. అందరూ ఆ పేరు చాలా బాగుందని చెప్పడంతో... ఆ పేరే పెట్టాం’ అని చెప్పారు. అమరావతిని రాజధానిగా, విశాఖను ఆర్థిక రాజధానిగా, తిరుపతిని మరో మహానగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించామన్నారు. కేంద్రం విభజన చట్టం ప్రకారం మంజూరుచేసిన సంస్థల్ని రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు.
వెయ్యి రోజుల ఉద్యమం ఎక్కడా లేదు
ఇంతవరకు వెయ్యిరోజులు ఉద్యమం జరిగిన దాఖలాలు ఎక్కడా లేవని, అమరావతి రైతులు ఉక్కు సంకల్పంతో పోరాడుతున్నారని చంద్రబాబు కొనియాడారు. రైతులు పోరాడకపోతే అమరావతి ఒక చరిత్రగా మిగిలిపోయేదన్నారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు కూడా... అమరావతి రైతుల ఉద్యమానికి ఆయా పార్టీల అధినేతలు, ముఖ్య నాయకులు సంఘీభావం ప్రకటించినట్టుగా చెప్పమన్నారడం మంచి పరిణామమని చంద్రబాబు పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయుడు ఆలపాటి సురేష్ సమన్వయకర్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల మహాపాదయాత్ర కోసం రూపొందించిన నాలుగు ప్రత్యేక గీతాల్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అమరావతి రైతుల ఉద్యమంపైనా పుస్తకం రాయాలని కందుల రమేష్‌కి కన్నా లక్ష్మీనారాయణ, శివారెడ్డి తదితరులు సూచించారు.
అబద్ధపు ప్రచారం
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిలో రాజధానిని ఆమోదిస్తున్నామని చెప్పిన వైకాపా.. అధికారంలోకి వచ్చాక అమరావతిని శాశ్వతంగా సమాధి చేద్దామనే ఉద్దేశంతో అభూతకల్పనలు, అర్ధసత్యాలతో, అబద్ధపు ప్రచారంతో.. కనీవినీ ఎరగని రీతిలో దుష్ప్రచారం చేసిందని సీనియర్ పాత్రికేయుడు ఆలపాటి సురేష్ విమర్శించారు.
రహస్య బ్యాలెట్ పెడితే.. వైకాపా ఎమ్మెల్యేల ఓట్లూ అమరావతికే - కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
‘అమరావతి రాజధానిపై రహస్య బ్యాలెట్ పెడితే.. వైకాపా ఎమ్మెల్యేల ఓట్లూ అనుకూలంగానే వస్తాయి. 151 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలతోపాటు కొంతమంది తెదేపా, జనసేన ఎమ్మెల్యే తనవెంటే ఉన్నా.. ఏ పాపం చేశారని జగన్‌మోహన్‌రెడ్డి తన ఇంటినుంచి సచివాలయానికి వెళ్లడానికి వెయ్యిమంది పోలీసుల్ని పెట్టుకుంటున్నారు?’
ఒక సామాజికవర్గానిదని పదేపదే దుష్ప్రచారం - ఎ.శివారెడ్డి, నాయకులు, అమరావతి పరిరక్షణ సమితి
‘అమరావతి ఒక సామాజికవర్గానిదని పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారు. దిల్లీకి వెళ్లినప్పుడు రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్‌కు మేము అమరావతి నుంచి వచ్చామని చెప్పాం. ఆయన అదంతా ఒక సామాజికవర్గానికి చెందినదన్నారు. తర్వాత వివరాలు చెబితే మద్దతిస్తామన్నారు. ప్రభుత్వానికి చేతకాకుంటే సీఆర్‌డీఏను అమరావతి పరిరక్షణ సమితి లాంటి సంస్థలకు అప్పగిస్తే.. 2030 నాటికి అప్పులు చెల్లించడంతోపాటు రూ.20వేల కోట్లు వెనక్కి ఇవ్వవచ్చు.’