ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

100 గజాల్లో రూ.3 లక్షలతో ఇల్లు... తెదేపా మేనిఫెస్టో విడుదల - local elections tdp manifesto news

పంచాయతీ ఎన్నికలకు పార్టీ ప్రణాళికను... తెలుగుదేశం అధినేత చంద్రబాబు విడుదల చేశారు. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే.... పల్లెల్లో చేపట్టే అభివృద్ధి పనుల ప్రణాళికను వివరించారు. తొలిదశ ఎన్నికలు జరిగే ప్రాంతాల నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు... పార్టీ ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశించారు.

Chandra babu
Chandra babu

By

Published : Jan 28, 2021, 12:55 PM IST

Updated : Jan 29, 2021, 4:06 AM IST

పంచాయతీ ఎన్నికలకు పార్టీ ప్రణాళికను తెదేపా అధినేత చంద్రబాబు గురువారం విడుదల చేశారు. ‘పల్లె ప్రగతికి పంచ సూత్రాలు’ పేరుతో.. ‘పల్లెలు మళ్లీ వెలగాలి’ అన్న నినాదంతో తెదేపా ఈ ప్రణాళికను రూపొందించింది. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నా.. తెదేపా మద్దతుతో పోటీచేసే అభ్యర్థులను గెలిపించాలని కోరేందుకు, వారు గెలిస్తే గ్రామాల స్వయం సమృద్ధి కోసం కృషి చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చేందుకు ఈ ప్రణాళిక రూపొందించినట్టు చంద్రబాబు పేర్కొన్నారు.

'పల్లె ప్రగతికి పంచ సూత్రాలు'... తెదేపా మేనిఫెస్టో విడుదల

ముఖ్యాంశాలు..

1. రక్షిత తాగునీరు:ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా నీటి కుళాయిలు.

2. భద్రత, ప్రశాంతతకు భరోసా:నేర రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతాం. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లతోపాటు పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, పవిత్ర స్థలాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పరిరక్షిస్తాం. బాలికల విద్యకు ప్రోత్సాహం. ప్రతి వీధిలో ఎల్‌ఈడీ దీపాలు. పట్టా భూములు, అసైన్డ్‌ భూముల కబ్జా జరగకుండా చర్యలు. భూ సర్వేలో భూ యాజమాన్య హక్కుల తారుమారుపై నిఘా.

3. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం:పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రతతో గ్రామాలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడం. మురుగునీటి కాల్వల నిర్మాణం.
*చెత్త నుంచి సంపద సృష్టించే షెడ్ల నిర్వహణ, నిర్మాణాలు. ఓవర్‌హెడ్‌ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచడం. పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీతాలు. ప్రజలపై భారం వేయకుండా ఇళ్ల నుంచి చెత్త సేకరణ.

*తెదేపా అధికారంలోకి రాగానే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ 100 గజాల్లో రూ.3 లక్షలతో ఇళ్ల నిర్మాణం.
*అంగన్‌వాడీ కార్యకర్తల సహకారంతో చిన్నారులకు పోషకాహారం.
*ప్రతి గ్రామంలో శ్మశానవాటికకు అవసరమైన స్థలం.
*ప్రతి గ్రామంలో ఉచిత వై-ఫై సౌకర్యం.
*గ్రామాల్లోని రహదారులను 100% సిమెంటు రోడ్లుగా మార్చడం.

4. స్వయం సమృద్ధి:వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్ల బిగింపు పథకాన్ని వ్యతిరేకిస్తూ పంచాయతీలో తొలి తీర్మానం.
*పంచాయతీల సహకారంతో మహిళలకు, వెనుకబడిన కులాలకు బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు.
*మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ గ్రామాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు.
*ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు, 100-150 రోజుల పనిదినాలు.
*గ్రామాల్లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం- పంట కుంటల నిర్మాణం.
*స్థానిక సంస్థలకు తగినన్ని నిధుల కోసం 74వ రాజ్యాంగ సవరణ అమలుకు కృషి.

5. ఆస్తి పన్ను తగ్గింపు - పౌర సేవలు:అధికారం చేపట్టిన 60 రోజుల్లోపే గ్రామాల్లో సమగ్ర సర్వే చేపట్టి గ్రామసభ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడంతోపాటు కొవిడ్‌ టీకా అందించేలా చర్యలు.
*పేదలపై భారంగా ఉన్న ఆస్తి పన్ను 50% తగ్గింపు - పన్ను బకాయిలపై రాయితీ.

బలవంతపు ఏకగ్రీవాలు ఉపేక్షించబోం..

వైకాపా చెప్తున్న ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతో జరిగేవి కావని... దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి చేసే బలవంతపు ఏకగ్రీవాలని చంద్రబాబు విమర్శించారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ విధ్వంసాలే ఉదాహరణగా పేర్కొన్నారు. వివిధ ఘటనలకు సంబంధించిన వీడియోలను చంద్రబాబు మీడియాకు చూపించారు. ప్రజల ఆమోదం లేని ఈ తరహా ఏకగ్రీవాలు ఉపేక్షించేది లేదని... ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం ఏ విధంగా ఖూనీ అయిందో ఈ ఘటనలే ఉదాహరణ అని మండిపడ్డారు.

2014లో 2.6శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవమైతే 2020లో 20శాతం పైగా ఎలా చేయగలిగారని ప్రశ్నించారు. 2014లో ఒక్క జడ్పీటీసీనే ఏకగ్రీవమైతే ఇప్పుడు పదుల సంఖ్యలో ఎలా చేయగలిగారని నిలదీశారు. మొత్తం 2700పైగా దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గత 20 నెలల్లో ప్రజలకు వైకాపా ఏం చేసిందని ఓటేయాలని ప్రశ్నించారు. తెదేపా హయాంలో అనేక రంగాల్లో ప్రథమ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపామని వివరించారు. తెదేపా హయాంలో 25వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు వేస్తే... వైకాపా 20 నెలల పాలనలో ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు వేశారని ప్రశ్నించారు.

ఆ మరణాలపై ఏం సమాధానం చెప్తారు..?

వైకాపా అధికారం చేపట్టాక రాష్ట్ర ప్రజలపై ఎంత అదనపు భారం పడిందో ప్రతి కుటుంబం ఆలోచించుకోవాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో కరోనా వల్ల 7వేల మందికిపైగా చనిపోయారంటే ముఖ్యమంత్రికి బాధ్యత లేదా అని ధ్వజమెత్తారు. ఎన్నికలకు కరోనా అడ్డంకి అంటున్న వారు 7వేల మరణాలపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీల్లో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలు... పంచాయతీ ఎన్నికల్లో కాకూడదని నేతలకు సూచించారు. తాను రామతీర్థం వెళ్లకుండా ఉంటే దేవాలయాలపై దాడులు ఆగేవి కాదని చంద్రబాబు పేర్కొన్నారు. మతసామరస్యాన్ని కాపాడే బాధ్యత సీఎం జగన్​పై లేదా అని ప్రశ్నించారు.

పోలీసు వ్యవస్థను ఏం చేయాలనుకుంటున్నారు..?

పల్లెలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి. వనరులన్నీ దోచుకున్న వైకాపా నాయకులు... ఇప్పుడు గ్రామాలకు వచ్చే నిధులనూ దోచుకోవాలని చూస్తున్నారు. అందుకే పంచాయతీ ఎన్నికల్లో అందరు ఆలోచించి ఓటు వేయాలి. డీజీపీ నిన్ననే(బుధవారం) కోర్టు మెట్లు ఎక్కి వచ్చారు. మళ్లీ రాత్రికి అచ్చెన్నాయుడుకి అన్యాయంగా 41 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. అసలు పోలీసు వ్యవస్థను ఏమి చేయాలి అనుకుంటున్నారు. రాజ్యాంగ ఉల్లంఘన చేసిన ఏ అధికారిని వదిలిపెట్టం. చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలి- చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి:

గవర్నర్‌ను కలిసిన భాజపా, జనసేన నేతలు

Last Updated : Jan 29, 2021, 4:06 AM IST

ABOUT THE AUTHOR

...view details