దివంగత నేత కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి నివాళులర్పించడానికి తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. నేరుగా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వెళ్లి కోడెల పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రబాబుతో పాటు లోకేశ్, తెదేపా నేతలు కోడెల భౌతికదేహానికి నివాళులు అర్పించారు. కోడెల కుటుంబసభ్యులను పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... ప్రజల కోసం పని చేసిన వ్యక్తి కోడెల అని కొనియాడారు. అనేక పదవుల్లో ఉంటూ ప్రజల కోసం సేవ చేసిన వ్యక్తి కోడెల శివప్రసాదరావు అన్న చంద్రబాబు.. రాజకీయ వేధింపులే కోడెల ఆత్మహత్యకు కారణమన్నారు. పులిలాంటి వ్యక్తి కోడెల ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేశారని ఆరోపించారు. మానసికంగా కుంగిపోయేంతగా కోడెలను వేధించారని చంద్రబాబు అన్నారు. కుర్చీలు, బెంచీలు తీసుకుపోయారని కోడెలపై ఆరోపణలు చేసి వేధించారన్నారు. కోడెలది ఆత్మహత్య కాదు... ఇది ప్రభుత్వం చేసిన హత్య అన్న చంద్రబాబు.. కోడెలను వేధించి... ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకువచ్చారన్నారు.