కరోనాతో ప్రజలంతా బాధపడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. ఐరోపా దేశాల్లో అత్యధికంగా పరీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. వారం రోజుల్లో 62 శాతం కరోనా కేసులు పెరిగాయని చెప్పారు. మన రాష్ట్రంలోనూ అత్యధికంగా ఒక్క వారంలోనే వెయ్యి శాతానికి కేసులు పెరిగాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో పరీక్షలు చాలా తక్కువ ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తించాలని... వాస్తవాలను దాచకూడదని సూచించారు. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలని కోరారు.
'ప్రధాని ఇచ్చిన పిలుపును అందుకుని ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. మనం పరిశుభ్రంగా ఉంటూ... పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ఒకరిని ఇంకొకరు తాకినప్పుడు కరోనా వస్తుంది. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. సామాజిక దూరంతోపాటు భౌతిక దూరం పాటించాలి'- చంద్రబాబు, తెదేపా అధినేత
కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని చెప్పారు. లాక్ డౌన్ తో పేదలు చాలా కష్టాలు పడుతున్నారని...వారిని ఆదుకునేందుకు తగిన కార్యాచరణను రూపొదించాలని కోరారు. మిగతా రాష్ట్రాల తరహా...రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాలని కోరారు.
కరోనా వైరస్ పోరాడుతున్న వైద్యులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు తగిన రక్షణ పరికరాలను అందించాలని చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవా సిబ్బందికి కావాల్సినవన్నీ ఇచ్చేలా చూడాలని వ్యాఖ్యానించారు.