వాల్మీకి, బోయ కులాలను షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న వాల్మీకి, బోయలు పేదరికంతో బాధపడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ వర్గాలు సాంప్రదాయకంగా వేట, అటవీ ఉత్పత్తులు సేకరించడం ద్వారా తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నాయని తెలిపారు. 2016లో ఆంధ్రప్రదేశ్‌లో వాల్మీకి, బోయల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రొఫెసర్ సత్యపాల్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్న చంద్రబాబు.. విస్తృతమైన ఫీల్డ్ వర్క్ ఆధారంగా ఒక సంవత్సరం పాటు చేసిన వివరణాత్మక పరిశోధన తర్వాత వాల్మీకి, బోయలను షెడ్యూల్డ్ తెగగా గుర్తించడంలో జాప్యం జరిగిందని కమిటీ గుర్తించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్.. వివిధ జిల్లాల్లో పర్యటించి వాల్మీకులు, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని నిర్ధారించిందని వెల్లడించారు. వాల్మీకి, బోయలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చడానికి వివిధ కమిషన్లు చేసిన సిఫార్సులను లేఖలో తమ దృష్టికి తీసుకొస్తున్నామన్నారు. 1961లో సెన్సస్ కమిషన్ కు చెందిన డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ రాయ్ బర్మన్ వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేశారని గుర్తు చేశారు.
1961-62లో ఆంధ్రప్రదేశ్ ట్రైబ్స్ ఎంక్వైరి కమిషన్ వాల్మీకి, బోయలను భూమిపుత్రులుగా నిర్ధారించి ఎస్టీలుగా గుర్తించాలని సూచించిందని పేర్కొన్నారు. తరువాత అనంతరామ కమిషన్ అనుకూలమైన సిఫార్సులు చేసినప్పటికీ వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చలేదని తెలిపారు. రాయలసీమ, కోస్తా ఆంధ్రలోని వాల్మీకి, బోయలు ఒకటేనని పేర్కొంటూ 1964 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు.