ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పంచాయతీ ఎన్నికల్లో వైకాపా రౌడీరాజ్యానికి ముక్కుతాడు వేయాలి' - chandrababu fiers on ycp govt

రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలు వైకాపా పతనానికి నాంది కావాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో వీడియోకాన్ఫరెన్స్​లో సమీక్షించిన ఆయన.. వైకాపా ఉన్మాద పాలనకు అడ్డుకట్ట వేసేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశమని వ్యాఖ్యానించారు. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే వైకాపా ఓటమి ఖాయమని స్పష్టం చేశారు.

chandrababu naidu
chandrababu naidu on local polls

By

Published : Jan 22, 2021, 10:55 PM IST

గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి పంచాయతీ ఎన్నికలు నాంది కావాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా రౌడీరాజ్యానికి ముక్కుతాడు వేయాలని స్పష్టం చేశారు. తెదేపా నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకాపా ఉన్మాద పాలనకు అడ్డుకట్ట వేసే అవకాశం ఈ ఎన్నికలని పేర్కొన్నారు. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలకు బుద్దిచెప్పే అవకాశం ఈ ఎన్నికల ద్వారా వచ్చిందన్నారు.

సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలి...

అన్ని పంచాయతీలలో అభ్యర్థులు పోటీలో ఉండేలా చూడాలని నేతలకు సూచించారు. బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడాలన్నారు. గత మార్చిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా హింసా విధ్వంసాలతో బలవంతపు ఏకగ్రీవాలు జరిగిన చోట్ల అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. నిన్నటి నుంచే పంచాయతీ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని..., ఎక్కడ ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తినా అన్నింటినీ మొబైల్ ఫోన్లలో రికార్డ్​ చేసి అధికారులకు, పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని నేతలకు సూచించారు. వైకాపా నాయకులు కొందరు పోలీసులతో కుమ్మక్కై గతంలో పెట్టిన అక్రమ కేసులు, దౌర్జన్యాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా అభ్యర్ధులు, నాయకుల ఇళ్లలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అడ్డంకులు సృష్టిస్తున్నారు...

ప్రజల్లో వైకాపాపై తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు అన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతో ఉన్నారని...., అందుకే ఎన్నికలు జరగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తమ అవినీతి కుంభకోణాలు, వైఫల్యాలు, హింసా విధ్వంసాలపై ప్రజల్లో వ్యతిరేకత చూసే పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పట్టిన శనిగా జగన్​రెడ్డి మారాడని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడని దుయ్యబట్టారు.

కోర్టులు, ఎన్నికల సంఘం, కేంద్రం, రాజ్యాంగ సంస్థలన్నీ రాష్ట్రంలో వైకాపా చేస్తున్న దమనకాండపై దృష్టి పెట్టాయని చంద్రబాబు తెలిపారు. గత ఏడాది మార్చి స్థానిక ఎన్నికల్లో జరిగినట్లుగా దాడులు, దౌర్జన్యాలకు అవకాశం లేదని చెప్పారు. 9 మంది కళంకిత అధికారులను, గత ఎన్నికల్లో హింసా విధ్వంసాలకు సహకరించిన అధికారులను విధులనుంచి తొలగిస్తూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. కాబట్టి ప్రతి పంచాయతీలలో నామినేషన్లు పడేలా చూడాలన్నారు. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే వైకాపా ఓటమి ఖాయమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎల్‌పీపై సోమవారం సుప్రీంలో విచారణ!

ABOUT THE AUTHOR

...view details