కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారు. ఇప్పుడు అన్ని చోట్లా ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ వద్దంటున్నారు. గత మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమాలు చేశారు. ఇప్పుడలా చేయలేరు కాబట్టి ఎన్నికలను అడ్డుకోవాలని కుట్ర పన్నుతున్నారు.
- చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్ తన కేసుల్లో ఉన్న అధికారులందరికీ ఉన్నత పదవులు కట్టబెట్టారని, వారంతా ఆయన దుశ్చర్యలకు వంత పాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. నిజాయతీగా పని చేసే అధికారులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలకు.. ముఖ్యమంత్రికి సంబంధమేంటి? స్వయంప్రతిపత్తి గల ఎన్నికల సంఘాన్ని నియంత్రించడానికి సీఎం ఎవరు? ముఖ్యమంత్రి తన వాళ్లతో స్థానిక ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పించడమేంటి?’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి తన చెప్పుచేతల్లో ఉన్న అధికారులకే ఉన్నత పదవులు కట్టబెడుతున్నారు. ఆయన కేసుల్లో నిందితులుగా ఉన్న అధికారులను రాష్ట్రాలు దాటించి మరీ ఉన్నత పదవుల్లో నియమిస్తున్నారు. శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్ నుంచి తెచ్చుకుని పురపాలకశాఖ కార్యదర్శిగా నియమించారు. ఆయన కేసుల్లో ఉన్న మరో అధికారి ఆదిత్యనాథ్ దాస్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేశారు. మరో నిందితుడిని ఒక జిల్లాకు కలెక్టరుగా నియమించారు. వాళ్లందరితో జగన్‌కు, ఆయన పార్టీకి అనుకూలంగా పని చేయిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు శనివారం పార్టీ లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఇతర ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్‌ది అపరిచితుడు సినిమా తరహాలో ‘స్ప్లిట్ పర్సనాలిటీ’ అని, ఆయన చెప్పింది చేయరని, చేసేది చెప్పరని చంద్రబాబు ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న పార్టీతో లాలూచీ పడటం మాని ఉద్యోగులు వారి డిమాండ్ల సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు.
దుర్గాప్రసాద్ ఇంటికి ఎందుకెళ్లలేదు?....
‘పులివెందులలో హత్యాచారానికి గురైన దళిత మహిళ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం వెళ్లలేదు. అబ్దుల్ సలామ్ బంధువులను గెస్ట్‌హౌస్‌కు పిలిపించుకుని మాట్లాడారు. వైకాపా ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణిస్తే ఆయన కుటుంబాన్ని సీఎం తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. అదే ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి చనిపోతే.. సీఎం వాళ్ల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇదేనా సామాజిక న్యాయం?’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.