రాష్ట్ర భవిష్యత్ కోసం పురపాలక ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైకాపా పాలనపై అన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. మరోసారి వైకాపాను నమ్మితే వారి బిడ్డల భవిష్యత్తుకే ప్రమాదమని హెచ్చరించారు. ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని చెప్పిన ఆయన, విజయవాడ నగరపాలక ఎన్నికల ప్రచారం సాగిస్తూ.. చైతన్యరథం నుంచే కాసేపు మాట్లాడారు.
ప్ర. విజయవాడతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో మీ పర్యటన సాగింది... ప్రజా స్పందన ఎలా ఉంది ?.
జ. అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయారు. చాలా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఈ విధంగా చేస్తోందేంటనే ఆవేదన అందరిలోనూ ఉంది. భవిష్యత్తులో ఎలా బతకాలనే ఆందోళన అన్ని ప్రాంతాల ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్ర. పురపాలక ఎన్నికల్లో ఓట్ల అడగట్లేదు, ప్రజల్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నారు. మీకున్న ఆ బాధ్యత ఏంటి?
జ. ప్రజల భవిష్యత్ గురించి హెచ్చరించాల్సిన బాధ్యత నాపై ఉంది. 5ఏళ్ల తెదేపా పాలనను-22నెలల వైకాపా పాలనను ప్రజలు బేరీజు చేసి చూశారు. ఆ రోజు నేను చెప్పినా వినకుండా వైకాపాకు ఓటేశామనే బాధ నేడు ప్రజల్లో ఉంది. ఈరోజు ఈ కష్టాలు కొనితెచ్చుకున్నామని విచారిస్తున్నారు. ప్రజల తరఫునే నేను పోరాడుతున్నా. ఏది కరెక్టుగా ఉంది. ఏం జరుగుతోందని అంతా ఒకసారి ఆలోచించుకోవాలి. నేను నా కోసం తిరగట్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా నాకవసరం లేదు. ప్రజలకు చెప్పి చైతన్యం చేయాల్సిన బాధ్యత మాత్రమే నాకుంది. భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోందో కూడా చెప్పాల్సిన అవసరమూ నాకుంది. ధర్మాన్ని కపాడుకుంటే ఆ ధర్మమే కాపాడుతుందని గుర్తించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడితేనే మనుగడ సాధింస్తాం. అవి రెండూ పోయిన తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయని ప్రజల్ని హెచ్చరిస్తున్నా. వారు కూడా వాస్తవాలు గ్రహిస్తున్నారు.
ప్ర. అమరావతి ప్రాంతంలో ప్రజల్ని రోషం లేదా అని రెచ్చకొడుతున్నారెందుకు ?
జ. ఒక్క అమరావతి ప్రాంతంలోనే కాదు. అన్ని ప్రాంతాల్లో ప్రజల్నీ ఇదే అడుగుతున్నా. ప్రత్యర్థులు తప్పుడు కేసులు పెట్టి బెదిరించి భయభ్రాంతులకు గురిచేస్తుంటే, ప్రజల పాత్ర లేకుండా ప్రతిపక్ష పార్టీనే ముందుకొచ్చి పోరాడాలంటే ఎలా. వాలంటీర్లకు, పోలీసులకు అందరికీ భయపడితే రాష్ట్రం ఏమౌతుందో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖలోనూ అదే జరుగుతోంది. దాదాపు 10వేల ఎకరాల భూ కబ్జా చేశారు. అక్కడి ప్రజలూ భయపడిపోయారు. అమరావతి, రాయలసీమ ప్రజలూ భయపడుతున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకూ ఒక్కటే చెప్తున్నా, వీళ్లు సృష్టించే అరాచకాలు, భయభ్రాంతులతో రౌడీయిజం పెరిగిపోయింది. ఇది రాష్ట్రానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నా.