మాజీ మంత్రి దేవినేని ఉమాపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వైకాపా నేతలను వదిలిపెట్టి.. తెలుగుదేశం పార్టీ నేతలపై హత్యాయత్నం కేసు పెట్టడం ఏంటని పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పార్టీ నేతలతో చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు. దేవినేని ఉమ అరెస్టు అంశంపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్టీపరంగా చేయాల్సిన నిరసన కార్యక్రమాలపై నేతలతో సమీక్షిస్తున్నారు.
పార్టీ నేతలతో చంద్రబాబు అత్యవసర సమావేశం.. దేవినేని అరెస్ట్ అంశంపై చర్చ - దేవినేని ఉమ అరెస్ట్ తాజా వార్తలు
09:59 July 28
దేవినేనిపై హత్యాయత్నం కేసుతో చంద్రబాబు ఆగ్రహం
కేసు నమోదుకు దారి తీసిన పరిస్థితులు...
కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో.. గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధరణకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైకాపా వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఇది వైకాపా, తెలుగుదేశం వర్గీయుల మధ్య బాహాబాహీకి దారితీయటంతో.. పోలీసులు లాఠీఛార్జి చేశారు. వాహనం ధ్వంసంతోపాటు... పలువురు గాయపడేందుకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరుతూ.. వాహనంలోనే ఉమా నిరసనకు దిగారు. కారు అద్దం పగులగొట్టిమరీ పోలీసులు ఉమాను అరెస్టు చేసి..పెదపారుపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి నందివాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చివరికి.. దేవినేని ఉమాపై.. అట్రాసిటీ, 307 సెక్షన్లు కింద జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని హత్యాయత్నానికి పాల్పడినట్లు.. 307 సెక్షన్ కింద అభియోగాలు మోపారు. ఈ విషయమై తెదేపా నేతలు ప్రభుత్వం తీరును, వైకాపా నేతల వైఖరిని.. చివరికి పోలీసుల వ్యవహారశైలిని సైతం తీవ్రంగా తప్పుబట్టారు. ఉమాపై కేసు నమోదు చేయడాన్ని అధినేత చంద్రబాబు సహా పార్టీ నేతలంతా ఖండించారు.