రాజకీయ కక్షసాధింపులతో కోడెలను బలితీసుకొని, ఇప్పుడు ఆయన ప్రథమ వర్ధంతి కార్యక్రమాలను సైతం అడ్డుకోవాలనుకోవడం ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహించారు. మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 36 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో ఉండి ప్రజల కష్టనష్టాలలో అండగా నిలిచిన నేత కోడెల అని గుర్తుచేశారు.
అవినీతిపరుల కక్షలు, కుట్రల కారణంగా కోడెల మనకు దూరమై ఏడాది గడిచిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. డాక్టరుగా పేదలకు సేవచేయడమే కాక, పల్నాటి రౌడీ రాజకీయాలకు చికిత్సచేసి శాంతిని, అభివృద్ధిని అందించారని కొనియాడారు. మూడున్నర దశాబ్దాల రాజకీయజీవితంలో ఎన్‌టీఆర్, చంద్రబాబు మంత్రి వర్గాల్లో పనిచేసి మచ్చలేని నాయకుడిగా పేరుపొందారని కీర్తించారు.