ప్రజల నిరసన చూసైనా పెట్రో ధరలు తగ్గించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్‌పై భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని నాయకులు ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల్లో స్కామ్‌లకు అడ్డుకట్ట వేసినా, దుబారా నివారించినా పెట్రోల్, డీజిల్‌పై ధరలు పెంచాల్సిన అవసరం రాదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని సమావేశంలో నేతలు దుయ్యబట్టారు. నిత్యం నేరాలు, అత్యాచార ఘటనలతో పత్రికలన్నీ నిండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచక పాలన వల్ల రాష్ట్రానికి రావాల్సిన రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని నేతలు మండిపడ్డారు. ఆర్థిక సంక్షోభానికి ఇది కూడా ఒక కారణమని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో భూకబ్జాలు పెరిగిపోయాయని.. ప్రశాంతమైన విశాఖను అశాంతి నిలయంగా మార్చారని విమర్శించారు.