ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆదాయం పెంచేది లేదు.. గండి కొట్టడమే తెలుసు: చంద్రబాబు - news of TDP

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం దివాళా తీయిస్తోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. ఆదాయం పెంచే మార్గాలు చూడకుండా.. రాబడికి గండికొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రం కూడా ఆశ్చర్యపోయేంత అధ్వాన్నస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ కక్షతో తెలుగుదేశం కేంద్ర కార్యాలయ పనులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

chandrababu-meet-with-tdp-leaders

By

Published : Oct 17, 2019, 3:10 AM IST

Updated : Oct 17, 2019, 5:39 AM IST


తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు... తాజా పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా 4 లక్షల మంది వైకాపా కార్యకర్తలకు గ్రామ వలంటీర్, సచివాలయ ఉద్యోగాలు ఎలా ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. తెదేపా హయాంలో ఆదాయ మార్గాలు పెంచుతూనే, పేదల సంక్షేమానికి పాటుపడినట్లు చెప్పారు. ఆ సమతుల్యత ఇప్పుడెందుకు లేకుండా పోయిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.
అలా చెప్పుకోవటం హాస్యాస్పదం..
పాలనా వైఫల్యాలతో అన్ని రంగాలను దెబ్బతీస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎగువ నుంచి భారీ వరద వచ్చినప్పుడు వేలాది చెరువుల్ని నింపే అవకాశం ఉన్నా... 4వేల టీఎంసీలు సముద్రంలోకి వదిలేశారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో రిజర్వాయర్లు నిండితే.. అది కూడా తమ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇసుక కొరత సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం... పరిష్కారానికి కనీస చర్యలు చేపట్టలేదని విమర్శించారు.

ఆదాయం పెంచేది లేదు.. గండి కొట్టడమే తెలుసు: చంద్రబాబు
మీసాలు తిప్పేవాళ్లు..అప్పుడేం చేశారు?ప్రధాన ప్రతిపక్షంగా ప్రజాసమస్యలు, శాంతిభద్రతలపై పోరాడితే తప్పేంటని చంద్రబాబు నిలదీశారు. అధికారులకు ఎందుకింత అసహనమని ప్రశ్నించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్య విషయంలో... పోలీసు అధికారుల సంఘం నేతలు మీసాలు తిప్పి, తొడలుకొట్టి బెదిరించారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో వైకాపా నేతలు పోలీసులను దూషించినప్పుడు... వీరంతా ఎక్కడికి పోయారని నిలదీశారు. మంగళగిరి సమీపంలో నిర్మిస్తున్న తెదేపా కేంద్ర కార్యాలయ పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహించారు.

తూర్పుగోదావరి, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించి, నియోజకవర్గాల వారీగా చేసిన సమీక్ష వివరాలను నేతలతో చంద్రబాబు పంచుకున్నారు. అన్ని స్థాయిల్లో పార్టీని పటిష్ఠం చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి : కేబినెట్ కీలక నిర్ణయం... మరో కొత్త పథకానికి శ్రీకారం..!

Last Updated : Oct 17, 2019, 5:39 AM IST

ABOUT THE AUTHOR

...view details