రాజధానితో అనేకమందికి పని ఉంటుందని.. మంత్రులు, కార్యదర్శులు, విభాగాల అధిపతులు వేర్వేరు చోట్ల ఉంటే పనులెలా అవుతాయని.. తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇదంతా ఒకరి సమస్య కాదు.. 5 కోట్ల ప్రజల సమస్య అన్నారు. నాయకులు ఎప్పుడూ భావితరాల కోసం ఆలోచించాలని ఉద్ఘాటించారు. మూడు రాజధానులు పెడితే పెట్టుబడిదారులు ముందు ఎక్కడకు రావాలని ప్రశ్నించారు. అమరావతి, విశాఖ, తిరుపతిలో ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు తెచ్చామనీ.. శివ్‌నాడార్, ముకేష్ అంబానీ, అదానీతో మాట్లాడి పెట్టుబడి పెట్టాలని కోరామని చంద్రబాబు తెలిపారు. ఎంతో పట్టుదలతో కియా మోటార్స్ తెచ్చామని.. ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని కంపెనీలు పారిపోయాయన్నారు.
ఎన్ని ఇబ్బందులున్నా తమ ప్రభుత్వం ఉపకారవేతనాలు ఆపలేదని చంద్రబాబు అన్నారు. ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని ఉద్ఘాటించారు. స్టాక్‌మార్కెట్లు, వ్యాపారంలోనే ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఉంటుందన్నారు. అమరావతిని సాధించేవరకు విద్యార్థులంతా పోరాడాలని తెదేపా అధినేత పిలుపునిచ్చారు. అమరావతి సాధనకు సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని సూచించారు. రైతులపై, మహిళలపై దౌర్జన్యాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.