Guntur News: గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో గతంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన వెంకాయమ్మ కుటుంబంపై మరోసారి అధికార పార్టీ నాయకులు దాడికి తెగబడ్డారు. వైకాపాకు చెందిన నల్లపు సునీత..వెంకాయమ్మపై పాత గొడవల కారణంగా తిట్ల దండకం నిత్యకృత్యమైంది. అయితే ఆమె తిట్లను రికార్డు చేయాలంటూ వెంకాయమ్మ తన కుమారుడికి సూచించింది. ఈ క్రమంలో గమనించిన సునీత.. అతన్ని వెంబడించింది. అతను పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లికి విషయం చెప్పాడు. ఈ క్రమంలో కంతేరులో వెంకాయమ్మ, ఆమె కుమారుడు వంశీపై నల్లపు సునీత వర్గం కర్రలతో దాడి చేసింది. దాడిలో గాయపడ్డ వెంకాయమ్మ కుమారుడ్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వంశీపై వైకాపా నేతల దాడిని ఖండిస్తూ తెలుగుదేశం నేతలు నక్కా ఆనందబాబు, ఇతర నేతలు తాడికొండ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఈలోగా అక్కడికి వైకాపా శ్రేణుల చేరికతో చాలాసేపటి వరకూ ఘర్షణ వాతావరణం కొనసాగింది. దాడి తీరుపై వెంకాయమ్మ కుమారుడు పోలీసులకు వివరించాడు. ఒక కుటుంబంపై పదేపదే దాడులు జరుగుతుంటే అడ్డుకోలేకపోవడం పోలీసుల వైఫల్యం కాదా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఈమేరకు డీజీపీకి లేఖ రాశారు. కొందరు పోలీసుల సహకారంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. అనంతరం బాధితురాలు వెంకాయమ్మతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆమెకు భరోసా ఇచ్చారు. ఎస్సీ కుటుంబంపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్న చంద్రబాబు.. నేడు చలో కంతేరుకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇవాళ పార్టీ నేతలు కంతేరు వెళ్లనున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పార్టీ నేత నక్కా ఆనందబాబు ప్రకటించారు.