రాష్ట్ర డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జనభేరి సందర్భంగా 600 మందికిపైగా తెదేపా నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అణిచివేత విచ్చలవిడిగా సాగుతోందని పేర్కొన్నారు. శాంతిభద్రతలు కాపాడే బదులు కొందరు పోలీసులు ప్రాథమిక హక్కులను అణిచివేయడంపైనే శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కొందరు పోలీసులు అధికార పార్టీతో కుమ్మక్కవటం విచారకరమని లేఖలో స్పష్టం చేశారు. తెదేపా నేతలకు జారీ చేసిన నోటీసులే ఇందుకు నిదర్శనమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కారాదు, ఏ కార్యక్రమంలో పాల్గొనరాదంటూ ఆ నోటీసుల్లో హెచ్చరించని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ), 19(1)(బి) మరియు 19(1)(డి) స్ఫూర్తిని కాలరాసేలా పోలీసుల నోటీసులు ఉన్నాయని మండిపడ్డారు.