ప్రజల ప్రాథమిక హక్కులను, శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులదేనని.. డీజీపీ గౌతం సవాంగ్‌కు రాసిన లేఖలో చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలని కోరటం.. ప్రతిపక్షనేతగా తన బాధ్యత అని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై వరుస దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రశ్నించే వారిపై అక్రమ అరెస్టులు, హింసాత్మక దాడులు, ఆస్తుల ధ్వంసం వంటి.. సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని లేఖలో ధ్వజమెత్తారు.
రాజమహేంద్రవరంలో తన కుమార్తెను అధికారపార్టీ వ్యక్తి వేధిస్తున్నాడని సత్తార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే.. నిందితుడిపై కేసు ఉపసంహరించుకోవాలని పోలీసులు బెదిరించారన్నారు. ఒత్తిళ్లు తట్టుకోలేకే ఎస్పీ కార్యాలయం ఎదుటే సత్తార్ ఆత్మహత్యకు యత్నించారని ఆరోపించారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటి బయట కారును దుండగులు ధ్వంసం చేశారని.. సమీపంలోనే పోలీస్ పికెట్ ఉన్నా ఈ దాడిలో అనేకమంది పాల్గొన్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టాభి మాట్లాడకుండా గొంతునొక్కాలనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆక్షేపించారు. పార్టీ నేతలపై ఈ తరహా గొలుసుకట్టు దాడులు గతంలోనూ చాలా జరిగాయన్న తెలుగుదేశం అధినేత.. బడుడు బలహీన వర్గాలు, మహిళలు, జర్నలిస్టులపైనా వరుస దాడులు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.