రాష్ట్రంలో బలహీన వర్గాల సాధికారతలో, అణగారిన వర్గాల హక్కులు కాపాడేందుకు గత ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం విముఖంగా ఉన్నట్లు వ్యవహరిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 3 ప్రయోజనాలు కాపాడుతూ షెడ్యూల్ ఏరియాలో టీచర్ పోస్టులు గిరిజనులకే దక్కేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం గిరిజనులకు శాపంగా మారిందని... వైకాపా ఉదాసీనత వల్లే బీసీల సాధికారతకు విఘాతం కలుగుతోందని ధ్వజమెత్తారు.
తెదేపా తెచ్చిన జీవో నం.3 ప్రయోజనాలు కాపాడాలి: చంద్రబాబు - chandrababu letter to cm on tribal rights
సీఎం జగన్ కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జీవో నంబర్ 3ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లోని ఉపాధ్యాయుల పోస్టులు వారికే దక్కేలా చూడాలని కోరారు.
వైకాపా చిత్తశుద్ధి లోపం వల్లే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 34శాతం నుంచి 24 శాతానికి కోతపడిందని మండిపడ్డారు. జీవో నంబర్ 3 ప్రయోజనం కాపాడి గిరిజన సాధికారతకు దోహదపడాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం గిరిజనాభివృద్దిపై తిరోగమన ప్రభావం చూపుతుందని..., గిరిజనులందరికి సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా వ్యవహరించి షెడ్యూల్ ఏరియాలో టీచింగ్ పోస్టులను జీవో నంబర్ 3 ప్రకారం గిరిజనులకే దక్కేలా సరైన చర్యలను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:పార్లమెంట్లో సమర్ధించి.... అసెంబ్లీలో తీర్మానామా!