ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CHANDRABABU : 'పని చేయని వాళ్లు పక్కన కూర్చోండి'

Chandrababu: వచ్చే ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావని.. రౌడీయిజం, విధ్వంసాన్ని తట్టుకుని నిలబడాలని చంద్రబాబు అన్నారు. పార్టీ ప్రతినిధుల అంతర్గత భేటీలో మాట్లాడిన ఆయన.. పని చేయకుండానే పదవులు ఆశించకూడదని స్పష్టం చేశారు. పని చేయలేని వారు పక్కకు తప్పుకోవాలని వ్యాఖ్యానించారు.

Chandrababu
Chandrababu

By

Published : Jan 5, 2022, 4:10 PM IST

Updated : Jan 6, 2022, 4:29 AM IST

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతూ పార్టీ శ్రేణుల్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికల మూడ్ లోకి తీసుకెళ్లే కార్యాచరరణను వేగవంతం చేశారు. పనిచేయని వాళ్లు పక్కకు తొలగాలంటూనే కొత్త ఏడాది ప్రక్షాళనలకు శ్రీకారం చుట్టారు. పార్టీలోనే ఉంటూ... నష్టం చేకూర్చే వారిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పిన అధినేత వచ్చేవి ఆషామాషీ ఎన్నికలు కాదని హెచ్చరించారు. వైకాపా రౌడీయిజం, అరాచకాలకు ఎదురొడ్డి పోరాడాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది కాలంలో ఏం చేయాలి, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై నియోజకవర్గ ఇన్ఛార్జులకు లక్ష్యనిర్దేశం చేశారు. నేడు కుప్పం వెళ్లనున్న చంద్రబాబు 8వ తేదీ వరకూ అక్కడే పర్యటించనున్నారు.

ఇష్టం లేకుంటే బాధ్యత నుంచి వైదొలగండి...

నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని కచ్చితంగా చేసి తీరాలని, అంకిత భావంతో పని చేయాల్సిందేనని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఇష్టంలేని వారుంటే దండంపెట్టి ఆ బాధ్యత నుంచి వైదొలగాలి. పార్టీ ఏమీ బాధపడదు. కొత్తవారికి అవకాశం వస్తుంది. పని చేయకుండా పదవులు రావాలని, పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటే ఉపయోగం లేదు’ అని పేర్కొన్నారు. పార్టీలో ఉంటూ నష్టం చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని హెచ్చరించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు, శాసనసభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఢీ అంటే ఢీ...

వచ్చేవి ఆషామాషీ ఎన్నికలు కాదని, వైకాపా రౌడీయిజాన్ని, దౌర్జన్యాల్ని, అరాచకాల్ని ఎదుర్కొని నిలవాలంటే... ఢీ అంటే ఢీ అనే నాయకత్వమే కావాలని చెప్పారు. ‘కుప్పం నియోజకవర్గం తెదేపాకు కంచుకోట. అక్కడి ప్రజలు నన్నెంతో అభిమానిస్తారు. అలాంటి చోటా వైకాపా నాయకులు వారి అరాచకాలతో పార్టీని ఇబ్బంది పెట్టారు. కుప్పంలోనే అలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి’ అని పేర్కొన్నారు.

వారానికి 3 రోజులు ప్రజల్లో ఉండాలి...

‘ఇన్‌ఛార్జులంతా ఇకపై వారంలో కనీసం 3 రోజులు ప్రజల్లో ఉండాలి. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడితే ప్రభుత్వం అడ్డుకుంటోంది. గ్రామాల్లో ఎంత తిరిగినా మనల్ని అడ్డుకోలేరు’ అని చంద్రబాబు చెప్పారు. ‘గ్రామ స్థాయి నుంచి పార్టీ సంస్థాగత కమిటీల నియామకం, సభ్యత్వాల నమోదు వచ్చే మహానాడులోగా పూర్తి చేయాలి. జనవరి 18న ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలి. అదే రోజు పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించి రెండు నెలల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలి.

భరోసా ఇవ్వాలి...

తెదేపా ఏర్పాటై మార్చి 29కి 40 ఏళ్లవుతోంది. వచ్చేది ఎన్టీఆర్‌ శతజయంతి సంవత్సరం. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని, ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించాలి’ అని చెప్పారు. గ్రామ, వార్డు కమిటీల నియామకం ఈ నెల 15లోగా, మండల, క్లస్టర్, బూత్‌ కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. బూత్‌లలో ప్రతి వంద మంది ఓటర్ల బాధ్యత ఒకరికి అప్పగించాలని, పార్టీ అధికారంలోకి వచ్చాక వారినే వాలంటీర్లుగా నియమిస్తామని చెప్పారు. ‘కొందరు ఇన్‌ఛార్జులు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు తప్ప స్వతహాగా చేయడం లేదు. అధికార పార్టీ నాయకుల అవినీతి, దోపిడీని ఎండగట్టడంలో విఫలమవుతున్నారు. స్థానిక సమస్యలపై పోరాటాలు చేయాలి. జోన్ల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించుకుని అందరూ అమలు చేయాలి. వైకాపా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తలొగ్గకుండానిలబడ్డ పార్టీ కార్యకర్తలకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. మనది 60 లక్షల మంది కార్యకర్తల సైన్యం. వారికి దిశానిర్దేశం చేస్తూ... సమస్య వస్తే నేనున్నానన్న భరోసా నాయకులు ఇవ్వగలగాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

జగన్ వైరస్సే ప్రమాదకరం...

ఈ నెల 8న రైతు సమస్యలపై, 11న నిత్యావసరాల ధరలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ‘రాష్ట్రానికి వైకాపా గ్రహణం పట్టింది. కరోనా వైరస్‌ కంటే జగన్‌ వైరస్సే ఎక్కువ ప్రమాదకరం. జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుంచి తప్పించుకోవచ్చు. జగన్‌ వైరస్‌ సోకితే అంతే సంగతులు. దాన్ని అరికట్టగలిగింది తెదేపా ఒక్కటే’ అని చంద్రబాబు పేర్కొన్నారు. మహనీయుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలని చంద్రబాబు సూచించారు.

క్యాలెండర్ ఆవిష్కరణ...

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల నేపథ్యంలో తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు రూపొందించిన క్యాలెండర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. స్వాతంత్య్ర పోరాటంలోని ముఖ్యఘట్టాలు, సమరయోధుల త్యాగాలు తెలిసేలా ఆ క్యాలెండర్‌ను రూపొందించారు.

Last Updated : Jan 6, 2022, 4:29 AM IST

ABOUT THE AUTHOR

...view details