Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులతో రెండో రోజూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడారు. విద్యార్థులకు సహాయం అందించే విషయంలో ఉక్రెయిన్‌లో స్థిరపడిన తెలుగు వారితో పాటు.. పోలండ్, హంగేరీలలో ఉన్న ఎన్ఆర్ఐలను చంద్రబాబు సంప్రదించారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన విద్యార్ధుల ఖర్చులకు ఇప్పుడు అవసరం అయిన డబ్బు, ఆహారం, హోటల్ ఖర్చులు అందించాలని వారిని కోరారు. ఇప్పుడు విద్యార్ధులకు ఎన్ఆర్ఐ లు చేసే ఖర్చును పార్టీ నుంచి వారికి తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు.
ప్రస్తుతం పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉందని ఎవరూ తమ తమ ప్రాంతాల నుంచి బయటకు రావద్దన్న ఇండియన్ ఎంబసీ సూచనలు పాటించాలని చంద్రబాబు సూచించారు. ఉక్రెయిన్‌కు పశ్చిమ ప్రాంతంలో ఉన్న దేశాల బోర్డర్ కు వెళ్లినా ఆయా దేశాలకు వెళ్లేందుకు ఉక్రెయిన్ సైనికులు అనుమతించడం లేదని విద్యార్దులు వాపోయారు. విద్యార్థుల కష్టాలపై ఇప్పటికే కేంద్ర మంత్రి జైశంకర్ తో స్వయంగా మాట్లాడానని చంద్రబాబు విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఇచ్చిన తాజా సమాచారంతో పాటు వారి కాంటాక్ట్, లోకేషన్ వివరాలను కూడా కేంద్ర విదేశాంగ శాఖకు పంపనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
పోలండ్, హంగేరీ బోర్డర్ కు వెళ్లిన విద్యార్ధులకు సహాయం చేసేందుకు కొందరు ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చారు. విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి పోలండ్, హంగేరీలోకి వస్తే వారికి అసవరమైన వసతి, ఆహారం ఇచ్చే ఏర్పాట్లు చేశామని చెప్పారు. మరోవైపు పరిస్థితులు అనుకూలిస్తే విద్యార్ధులను బోర్డర్ లకు తరలిస్తామని ఉక్రెయిన్ లో స్థిరపడిన తెలుగు వారు దివ్యారాజ్, జగ్వార్ కుమార్ తెలిపారు. రవాణాకు అవసరం అయిన బస్సులు తాము సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అనుమతించిన వెంటనే తరలింపు ప్రక్రియ చేపడతాం అని చెప్పారు.