ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాపై ప్రభుత్వ తీరు బాధ్యతారాహిత్యం : చంద్రబాబు

స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీం ఇచ్చిన తీర్పును సైతం వైకాపా వక్రీకరిస్తోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించే సంస్కృతి వైకాపా మరిచిందని విమర్శించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిపోయి, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు అన్నారు. అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తుంటే తీరిగ్గా ఇవాళ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిందన్నారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : Mar 18, 2020, 8:02 PM IST

Updated : Mar 18, 2020, 8:14 PM IST

తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పుతో అయినా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుంటుందా? అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా వక్రీకరిస్తూ ఇంకా దిగజారి మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. స్పీకర్ పదవిలో ఉన్నంత మాత్రాన రాజ్యాంగ వ్యవస్థలనే తప్పు పడతారా? అని నిలదీశారు. ఎన్నికల వాయిదా వల్ల ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయని గగ్గోలు పెట్టి ఆ విషయాన్ని కోర్టు అఫిడవిట్​లో ఎందుకు సమర్పించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూసి దొరికిపోయారని అన్నారు. కరోనా పట్ల రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యం బయటపడిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో 16 రాష్ట్రాలు ఇప్పటికే జన సమూహాలు ఉండకూడదని, పాఠశాలలు మూసివేశాయని గుర్తుచేశారు. ప్రతిపక్షాల గగ్గోలుతో ఏపీ ప్రభుత్వం ఇవాళ పాఠశాలల మూసివేత నిర్ణయం తీసుకుందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘాన్ని ఇష్టం వచ్చినట్లు దూషించారని ఆరోపించారు.

కరోనాపై అప్రమత్తతపై మాట్లాడుతున్న చంద్రబాబు

కరోనా కేసుల లెక్కలు బయటపెట్టాలి : చంద్రబాబు

రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్నా కావాలనే దాచి పెడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఎంత మంది విదేశీయులు వచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర లెక్కల ప్రకారం 11వేల మంది ఏపీకి వచ్చారని వారిపట్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పర్యవేక్షణ ఏమిటని నిలదీశారు. జగన్ కుమార్తెలు కూడా విదేశాల నుంచి వచ్చారని అంటున్నారన్న చంద్రబాబు... అలా వచ్చి ఉంటే వారినీ 14 రోజుల పర్యవేక్షణలో పెట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఐసోలేషన్ వార్డులు ఎక్కడెక్కడ పెట్టారని ప్రశ్నించారు. ఏడాది అవుతున్నా తనను, తెలుగుదేశం పార్టీని తిట్టడం తప్ప రాష్ట్రం కోసం ఏంచేశారని చంద్రబాబు ప్రశ్నించారు.

కరోనాపై తెదేపా అవగాహన పత్రం

కరోనా అవగాహనపై కరపత్రం

వైకాపా ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలు వీడి ప్రజారోగ్యం కోసం కృషి చేయాలని చంద్రబాబు హితవుపలికారు. తమని బూతులు తిడితే పైచేయి సాధించినట్లు భావించొద్దన్నారు. కరోనా పట్ల ప్రభుత్వానికి పట్టకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చంద్రబాబు సూచించారు. కరోనాపై అవగాహన కల్పించే కరపత్రం, పుస్తకాన్ని చంద్రబాబు విడుదల చేశారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టే వాళ్లు చేయాల్సిన పని తాము చేస్తున్నామన్నారు.

బ్లీచింగ్ పౌడర్ పై చంద్రబాబు వ్యాఖ్యలు

బ్లీచింగ్ పౌడర్ మనిషిపై చల్లాలా...!

కరోనాకు పారాసిటమాల్‌ను మందు కనుగొన్న జగన్​కు నోబెల్ బహుమతి కూడా వస్తుందని జనాలందరూ వ్యగ్యంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతున్న జబ్బుపై పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ చాలు అని సీఎం అంటున్నారన్నారు. బ్లీచింగ్ పౌడర్ మనిషిపై చల్లాలా అని ప్రశ్నించారు. జగన్ పొరపాటున చెప్పి ఉండవచ్చన్న చంద్రబాబు.... తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. జగన్‌గా మాట్లాడితే తప్పులేదన్న చంద్రబాబు... సీఎం పదవిలో ఉండి ఇలా మాట్లాడకూడదని హితవు పలికారు. కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు కూడా కేంద్రం సూచించిన నిబంధనలు అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రులు కూడా స్వీయ నిర్బంధం​లో ఉన్నారని పేర్కొన్నారు. షిర్డీ ఆలయాన్నీ మూసి వేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భారతదేశంలో కరోనా వైరస్‌ ఒక్కసారి విజృంభిస్తే నిలువరించడం కష్టమన్న చంద్రబాబు... ఫ్రాన్స్​లో ఎన్నికలు పెడితే ఏమయిందో తెలీదా అని ప్రశ్నించారు. కరోనా ప్రభావంతో ఆక్వా, ఫౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా దెబ్బతిందని ఆవేదన చెందారు.

ఇదీ చదవండి :'సుప్రీంతీర్పుపై వైకాపా ఏం సమాధానం చెబుతుంది?'

Last Updated : Mar 18, 2020, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details