ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్‌ మీటర్లు రైతుల పాలిట ఉరితాళ్లు: చంద్రబాబు

వ్యవసాయ బోర్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యుత్‌ మీటర్లు రైతుల పాలిట ఉరితాళ్లని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నగదు బదిలీ పేరిట తీసుకువచ్చిన 22వ నెంబర్‌ జీవోను రద్దుచేసి ఉచిత విద్యుత్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. 16 నెలల్లోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. మరో రెండేళ్లలో జమిలి లేదా ముందస్తు ఎన్నికలు వస్తే వైకాపా పనైపోయినట్లేనన్న చంద్రబాబు... ఈలోపు ఇష్టానుసారం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం గంటకు 9 కోట్ల రూపాయల చొప్పున నిమిషానికి 18 లక్షలు, సెకనుకు 30వేల రూపాయలు ప్రజలపై అప్పుభారం మోపుతోందని ధ్వజమెత్తారు.

Chandrababu fires on Jagan over new meters for agriculture bores
చంద్రబాబు

By

Published : Sep 5, 2020, 6:49 PM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమేమీ జగన్‌ బానిస కాదని చంద్రబాబు తేల్చి చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్‌ జగన్‌ ఇచ్చే భిక్ష కాదని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ నయవంచన రోజుకొకటి బయటపడుతోందన్న చంద్రబాబు... రైతుల పాలిట ప్రభుత్వ నిర్ణయాలు గుదిబండగా మారాయని విమర్శించారు. వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ పథకం అంటూ వైకాపా ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగించడాన్ని రైతులందరూ వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వం మాత్రం అప్పు తెచ్చుకోవడమే తమకు ముఖ్యమంటూ ముందుకు పోతోందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్​ను రైతులు పోరాడి సాధించుకున్న హక్కని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్ణయం రాయలసీమ, మెట్ట ప్రాంతాల రైతుల మనోభావాలు దెబ్బతీస్తోందని ఆరోపించారు. వ్యవసాయానికి మీటర్లు బిగింపు రైతుల ప్రాణాలు తీయటమేనని ధ్వజమెత్తారు.

తేనె పూసిన కత్తి లాంటి మాటలతో రైతులను మోసం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. అప్పులు చేయటమే ప్రాధాన్యతగా ప్రభుత్వం ముందుకు పోతోందని మండిపడ్డారు. విద్యుత్ రంగంపై తెదేపాకు అన్ని హక్కులు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికింది తెదేపా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు దేశానికే ఆదర్శమని చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వ నగదు బదిలీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. అమరావతి రైతుల పోరాట స్ఫూర్తితో అంతా సంఘటితoగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక్కసారి మోసపోతే శాశ్వతంగా నష్టపోతారని గ్రహించాలన్న చంద్రబాబు... ప్రభుత్వ నిర్వాకం వల్లే రాష్ట్రంలో అన్నదాతలు, కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆక్షేపించారు.

చంద్రబాబు

అన్నదాత సుఖీభవ రద్దు చేసి 7500 రూపాయలతో సరిపెట్టడం రైతులకు వెన్నుపోటు పొడవటం కాదా అని ప్రశ్నించారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు, ప్రజలకు పింఛన్లు ఇవ్వలేని వాళ్లు... రైతులకు నగదు బదిలీ ఎలా చేస్తారని నిలదీశారు. తాజా పరిస్థితులు చూస్తే రాష్ట్రం ఏమౌతుందోననే భయం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవసాయానికి విద్యుత్‌ మీటర్లు పెట్టడం వెంటిలేటర్‌పై ఉన్న రైతుతో కసరత్తు చేయించే విధంగా ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

విద్యుత్‌ మీటర్లకు సంబంధించి 30ఏళ్లకు ప్రణాళిక వేసుకున్నామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల ముందు ఉచిత విద్యుత్‌ అని చెప్పి ఇప్పుడు మాట తప్పి మడమ తిప్పడమేంటని నిలదీశారు. దొడ్డిదారిన అప్పులు తేవడానికి రైతుల్ని ముఖ్యమంత్రి జగన్‌ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెదేపా ప్రభుత్వం ఐదేళ్లలో 1.20 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెస్తే.. ఈ ప్రభుత్వం 15 నెలల్లోనే 1.03 లక్షల కోట్లు అప్పులు చేసిందని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వానికి అప్పులివ్వమని కొన్ని బ్యాంకులు ఛీకొడుతున్నా... దొడ్డిదారిన అప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. తరతరాలుగా ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని, కలెక్టరేట్‌ల స్థలాల్ని, క్రీడా మైదానాల్ని అమ్మేయాలనుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా అప్పు పరిమితిని 0.25 శాతం పెంచుకోవడానికి 18 లక్షల మంది రైతులకు ద్రోహం చేసి వాళ్ల పొట్టకొట్టడం వెన్నుపోటేనని మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. వైకాపా రెండు సార్లు దొంగచాటుగా ధరలు పెంచితే మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విభజన నాటికే ఏపీకి 12 శాతం మిగులు విద్యుత్‌ ఉందని ప్రభుత్వ సలహాదారు చెప్పటంపై చంద్రబాబు మండిపడ్డారు. 2014లో గవర్నర్‌ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏపీకి 46.11 శాతం కేటాయించినట్టు స్పష్టంగా ఉంటే సలహాదారు వింతవాదన, కల్లబొల్లి కబుర్లేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్కో మీటరుకి 6 వేల రూపాయలు ఖర్చవుతుందన్న చంద్రబాబు... 18 లక్షల పంపుసెట్లకు మీటర్లు పెట్టడం ప్రజలపై మోపే అదనపు భారమేనని స్పష్టం చేశారు. అదనపు లోడ్‌ కనెక్షన్‌ ఉన్న రైతులకు డెవలప్‌మెంట్‌ ఛార్జీల కింద హెచ్‌పీకి 1,200 రూపాయలు, సెక్యూరిటీ డిపాజిట్‌కింద 60 రూపాయలు వేస్తుంటే అది ఎవరు కడతారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇదీ చదవండీ... 'చంద్రబాబు కృషి వల్లే ఈజ్​ ఆఫ్​ డూయింగ్​లో ఏపీకి అగ్రస్థానం'

ABOUT THE AUTHOR

...view details