నివర్ తుపాను ప్రభావిత ప్రాంత తెదేపా నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ చేశారు. విపత్తు బాధితులకు సోషల్ మీడియా కార్యకర్తలు అండగా ఉండాలని సూచించారు. పార్టీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి.. నష్టం అంచనాలను నివేదించాలని కోరారు. 114 నియోజకవర్గాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుగ్గవంక, పింఛా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు ఉదంతాలే వైకాపా చేతగాని పాలనకు ప్రత్యక్ష సాక్ష్యాలని మండిపడ్డారు.
ముంపు తీవ్రతపై ముందస్తు హెచ్చరికలు లేవన్న చంద్రబాబు... లోతట్టు ప్రాంత ప్రజల తరలింపు, సహాయ పునరావాస శిబిరాల నిర్వహణల్లో పూర్తి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారని దుయ్యబట్టారు. సీఎం జగన్ ఏరియల్ సర్వే చేసి చేతులు దులుపుకొన్నారని ఆక్షేపించారు. కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకోవటం అందరి బాధ్యతన్న చంద్రబాబు... నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి తోచిన విధంగా ఆదుకోవాలని ఆదేశించారు.