ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CBN: 'రాష్ట్రంలో అసలు డీజీపీ ఉన్నారా?.. వ్యక్తుల్ని చంపేస్తుంటే సీబీఐ ఏం చేస్తోంది?' - CBN fires

‘రాష్ట్రంలో డీజీపీ ఉన్నారా? ఆయన అఖిల భారత సర్వీసుల పరీక్షలు పాసయ్యారా? ఖాకీ బట్టలకు కనీసం న్యాయం చేస్తున్నారా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పోలీసులు అధికారంలో ఉన్నవారికి లొంగిపోయి బానిసల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Chandrababu Fires on DGP
Chandrababu Fires on DGP

By

Published : Jun 11, 2022, 8:16 AM IST

Chandrababu Fires on DGP: రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పోలీసులు అధికారంలో ఉన్నవారికి లొంగిపోయి బానిసల్లా వ్యవహరిస్తున్నారని.. వారు చేస్తున్న హత్యలు, అరాచకాలు, అక్రమాలకు వంత పాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలీసు శాఖను తాడేపల్లి నౌకరు పాలిస్తున్నారని ఆరోపించారు. అందుకే డీజీపీలు మారినా, ఆ శాఖ పనితీరు మారడం లేదని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో డీజీపీ ఉన్నారా? ఆయన అఖిల భారత సర్వీసుల పరీక్షలు పాసయ్యారా? ఖాకీ బట్టలకు కనీసం న్యాయం చేస్తున్నారా?’ అని నిలదీశారు. పోలీసుల దాష్టీకాన్ని ఇక సహించబోమన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షుల్ని, అనుమానితుల్ని ఇష్టానుసారం చంపేస్తుంటే సీబీఐ ఏం చేస్తోందన్నారు. ‘జగన్‌పై అవినీతి కేసుల్లో సీబీఐ ఏం చేసింది? రూ.42 వేల కోట్ల అవినీతి జరిగిందని ఛార్జిషీట్‌ వేశాక కూడా ఎందుకు చర్యల్లేవు? ఒక నేరస్థుడు ముఖ్యమంత్రి అయితే ఎన్ని నేరాలు, ఘోరాలు చేసినా సీబీఐ పట్టించుకోదా’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

‘వివేకా హత్య కేసులో సీబీఐ దగ్గర అప్రూవర్‌గా మారిన వ్యక్తిని చంపేస్తామని బెదిరిస్తే, అతను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. సీబీఐ డ్రైవర్‌కు కొందరు ఫోన్‌ చేసి కడప వదిలి వెళ్లకపోతే బాంబులు వేసి చంపేస్తామని బెదిరించారు. దర్యాప్తు అధికారిగా ఉన్న డిప్యూటీ డైరెక్టర్‌పైనే కేసు పెడితే, ఆయన హైకోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది. పరిటాల రవి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతుండగానే, సాక్షులందర్నీ చంపేసి కేసు నీరుగార్చారు. ఇప్పుడు వివేకా హత్య కేసులోనూ అదే జరుగుతోంది’ అని అన్నారు. వివేకా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీనివాసరెడ్డి, గంగిరెడ్డి, గంగాధర్‌రెడ్డి మరణాలకు కారణమేమిటని ప్రశ్నించారు. మూడేళ్ల వైకాపా పాలనలో అధికార పార్టీ నాయకుల అవినీతికి, దాష్టీకాలకు బలైన సామాన్యుల వివరాలతో తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. ‘ఫ్యాక్షనిస్ట్‌ పాలనలో క్రూర హత్యలు’ పేరుతో పార్టీ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించి, విలేకర్లతో మాట్లాడారు.

తప్పు చేసిన పోలీసులపై విచారణకు ప్రత్యేక ట్రైబ్యునల్‌:తప్పు చేసిన ప్రతి పోలీసు అధికారి లెక్కలూ తమ దగ్గరున్నాయని, వారిపై విచారణ జరిపి శిక్షలు విధించేందుకు తెదేపా అధికారంలోకి రాగానే ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పార్టీ కార్యకర్తలపై పోలీసుల వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు జిల్లాల్లో జరిగే మహానాడుల్లోనూ, పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ ప్రత్యేక డెస్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కేసుల్లో వాదించడానికి ప్రతి జిల్లాలోనూ పార్టీ న్యాయవాదుల్ని నియమిస్తుందని, అవసరమైతే పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తామని చెప్పారు. ‘పదో తరగతిలో 2 లక్షల మందికి పైగా పిల్లలు ఫెయిలయ్యారు. ఆ బెంగతో 8-9 మంది పిల్లలు చనిపోయారు. ఈ ప్రభుత్వం చేస్తోంది సామాజిక న్యాయం కాదు. సామాజిక హత్యలు. కరెంట్‌ వినియోగం 300 యూనిట్లు దాటనివారికే అమ్మఒడి ఇస్తామని ప్రభుత్వం మొదట నిబంధన పెట్టిందా? ఐటీడీపీ కార్యకర్తలపై ఎందుకు కేసులు పెట్టారు? నా లెటర్‌హెడ్‌ పైనే ఫోర్జరీ చేస్తే మాత్రం మీరెందుకు మాట్లాడరు?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ఎస్సీ యువకుణ్ని హత్య చేస్తే.. ప్రజల దృష్టి మళ్లించేందుకు కోనసీమలో చిచ్చు పెట్టారన్నారు. ఇప్పుడు అక్కడ తప్పుడు కేసులతో అందర్నీ వేధిస్తున్నారని ఆరోపించారు.

జగన్‌కు అవే చివరి ఎన్నికలు:వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ గెలుస్తామని వైకాపా నేతలు అంటున్నారు కదా? అన్న విలేకర్ల ప్రశ్నకు.. ‘రాబోయే ఎన్నికలే జగన్‌కు చివరివి. ఒక్క ఛాన్స్‌ ఇవ్వండని అడిగారు. అదే ఆయనకు ఆఖరి ఛాన్స్‌ కూడా’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పదోతరగతిలో తప్పిన విద్యార్థులకు భరోసా ఇద్దామని లోకేశ్‌ జూమ్‌ సమావేశం పెడితే.. దానిలో వైకాపా నాయకులు దొంగల్లా చొరబడ్డారని విమర్శించారు. అలాంటివి చాలా చేస్తామన్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ. వాళ్లేం చేస్తారో చూస్తా. నేనేం చేయాలో నాకు తెలుసు అన్నారు. కోనసీమలో రైతులు పంట విరామం ప్రకటించడానికి తెదేపానే కారణమని మంత్రి అంటున్నారు కదా అని ప్రశ్నించగా.. ‘ఈ మూడేళ్లలో రైతులకు ఏం చేశారు? ఎరువులు, పంటకు మద్దతు ధర, కొన్న ధాన్యానికి సకాలంలో డబ్బులు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆక్వా, ఉద్యాన రైతులు కూడా క్రాప్‌ హాలీడే ప్రకటించే పరిస్థితికి వచ్చారు’ అని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఎవరికి మద్దతిచ్చేదీ అప్పుడు చూద్దామని చెప్పారు.

వేధింపుల విభాగంలా సీఐడీ: సీఐడీ.. వేధింపుల విభాగంగా మారిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘సీఐడీ అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ, ప్రతిపక్ష నాయకులను అరెస్టులు చేస్తోంది. వాళ్లు సమయం, సందర్భం లేకుండా, మఫ్టీలో వచ్చి బలవంతంగా తీసుకెళుతున్నారు. తెదేపా నేత గౌతు శిరీషను ఇలాగే మఫ్టీలో వచ్చి నిబంధనలకు విరుద్ధంగా స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. యూనిఫాంలో లేని వారిని పోలీసులనుకోవాలా? వైకాపా గూండాలనుకోవాలా? దాడులు చేసిన వైకాపా నాయకులపై కేసులు పెట్టకుండా, బాధితులైన తెదేపా నేతలపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. నిరసనకో, ఆందోళనకో పిలుపునిస్తే మా పార్టీ నాయకుల్ని ముందే అక్రమంగా నిర్బంధిస్తున్నారు. రౌడీషీట్లు తెరిచి రోజూ స్టేషన్‌కు తిప్పుతున్నారు. వీటికి బాధ్యులందర్నీ కోర్టుకు లాగుతాం’ అని హెచ్చరించారు.

ఇదీచదవండి:

ABOUT THE AUTHOR

...view details